సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 జనవరి 2024 (12:47 IST)

కాంగ్రెస్ వాసన తగలగానే షర్మిల భాష, యాస మారింది : సజ్జల రామకృష్ణారెడ్డి

sajjala ramakrishna reddy
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగానే వైఎస్ షర్మిల భాష, యాస మారిపోయిందని ఏపీ ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. ఏపీలో భూతద్దంలో చూసినా అభివృద్ధి కనిపించడం లేదంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 
 
వైఎస్ఆర్ ఆశయాలకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని గుర్తు చేసిన సజ్జల... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే షర్మిల భాష, యాస మారిపోయిందన్నారు. వైఎస్ మరణాంతరం ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంతగా వేధించిందో అందరికీ తెలుసన్నారు. జగన్‌ను జైలుకు పంపించింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన చెప్పారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ నాయకులు విఫలమయ్యారని షర్మిల చేసిన వ్యాఖ్యలపైనా సజ్జల స్పందించారు. ఏపీని అడ్డగోలుగా చీల్చింది కాంగ్రెస్‌ పార్టీ కాదా? అని ఆయన ప్రశ్నించారు. విభజన సరిగ్గా జరిగి ఉంటే పోరాడాల్సిన అవసరం ఎందుకు వచ్చేదని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అనేది చట్టంలో పెట్టి ఉంటే పరిస్థితి ఇలా ఎందుకు ఉండేదని నిలదీశారు. 
 
కాంగ్రెస్‌ చేసిన తప్పునకు మూల్యం చెల్లించుకుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ చేసిన తప్పునకు వైసీపీని నిలదీయడం ఏంటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికీ వైసీపీ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. అవకశం వచ్చినప్పుడు సాధించాలనే పట్టుదలతో ఉన్నామని అన్నారు. కేంద్రంలో ఎవరు ఉన్నా రాష్ట్రానికి మేలు జరిగేలా జగన్‌ నడుచుకుంటున్నారని వివరించారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఉనికే లేదన్నారు. గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఏపీలో కాంగ్రెస్‌కు రాలేదని ఎద్దేవా చేశారు. షర్మిల ఇప్పుడు కొత్తగా వచ్చి ఆ పార్టీకి చేసేదేం లేదని విమర్శించారు. రాహుల్‌ను ప్రధానిని చేయాలని అనుకుంటే షర్మిల తెలంగాణలో పోటీ చేయాల్సిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబును సీఎం చేయడమే ఆమె లక్ష్యంగా ఉందని ఆరోపించారు. ప్రజలను చంద్రబాబు ఏమార్చాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కుట్రల్లో షర్మిల ఒక అస్త్రంలా మారిందనిపిస్తోందని అన్నారు.