మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2024 (11:41 IST)

రిపబ్లిక్ డే రోజున జనసేన పోటీ చేసే రెండు స్థానాల పేర్లను ప్రకటించిన జనసేన : పవన్ కళ్యాణ్

pawan kalyan
భారత గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 'ఆర్' అక్షరం తనకు బాగా నచ్చుతుందని ప్రకటించిన ఆయన... రిపబ్లిక్ డే రోజున జనసేన పోటీ చేసే రెండు అసెంబ్లీ స్థానాల పేర్లను ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఆ రెండు స్థానాల్లో ఒకటి రాజోలు, రెండోది రాజానగరం అని చెప్పారు. ఈ రెండు చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. 
 
రిపబ్లిక్ డే వేడుకలు మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగాయి. ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొత్త ధర్మం ప్రకారం టీడీపి వాళ్ళు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదన్నారు. కానీ, మండపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని, దీనిపై మండపేట జనసేన నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయగా వారితో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. 
 
చంద్రబాబు నాయుడుకు ఏ విధమైన ఒత్తిడి ఉంటుందో, అలాంటి ఒత్తిడి తనకు కూడా ఉంటుందని, అందువల్లే తాను కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నట్టు తెలిపారు. రాజోలు, రాజనగరం అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని తెలిపారు. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో జనసేన - టీడీపీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇదే అంశంపై ఇరు పార్టీ మధ్య చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇంతలో మండపేటలో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటించడం, ఇపుడు రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం ఈ రెండు పార్టీల పొత్తుపై చర్చనీయాంశంగా మారింది.