మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2024 (10:18 IST)

సీఎం జగన్ జీసెస్ వాక్యాలను పాటించే వ్యక్తి కాదు... : పవన్ కళ్యాణ్

pawan kalyan
క్రైస్తవ మత సంప్రదాయాలను అనుసరించే ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏసుక్రీస్తు వాక్యాలను పాటించే వ్యక్తిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన జీసెస్ వాక్యాలను పాటిస్తే రాష్ట్రాన్ని ఇలా ఇబ్బందులకు గురిచేసేవాడు కాదని అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జీసస్ వాక్యాలను పాటించే వ్యక్తి కాదని, ఆయన జీసస్ వాక్యాలను పాటిస్తే రాష్ట్రాన్ని ఇలా ఇబ్బందులకు గురిచేసేవాడు కాదన్నారు. 
 
ముఖ్యమంత్రి... మతాన్ని తన స్వార్థం కోసం వాడుకునే వ్యక్తి అని విమర్శించారు. మానవత్వంతో నిలబడే వ్యక్తికి మతం ఉండదని, తన మతాన్ని ప్రేమిస్తూ, ఇతర మతాలను గౌరవించేవారే ప్రజలకు న్యాయం చేయగలుగుతారని పవన్ పేర్కొన్నారు. తాను జగన్మోహన్ రెడ్డి తరహాలో మాటలు చెప్పనని స్పష్టంచేశారు.
 
జగన్ హయాంలో 517 దేవాలయాలు అపవిత్రం అయ్యాయని ఆరోపించారు. అందుకు సంబంధించిన దోషులను పట్టుకోకపోతే పాలకుడు అన్య మతస్తులపక్షం వహిస్తున్నారనే భావన హిందువుల్లో కలుగుతుందన్నారు. జగన్ అనే వ్యక్తి సీఎం అయ్యాక క్రైస్తవ సమాజం ఇలాంటి పనులకు పాల్పడుతోందన్న భావన అంతర్గతంగా పెరిగిపోతోందన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని, ఇలాంటి రుగ్మతలను పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతోనే తాను మాట్లాడతానని, ఈ అంశాన్ని తాను ఏసు క్రీస్తు నుంచి అలవర్చుకున్నానని చెప్పారు.