సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2024 (09:09 IST)

చాలా గర్వంగా భావిస్తున్న : 'పద్మ విభూషణ్' మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

venkaiah Naidu
తెలుగు బిడ్డ, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరకు వెంకయ్య నాయుడుకి కేంద్ర ప్రభుత్వం దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన "పద్మ విభూషణ్" వరించింది. దీనిపై ఆయన స్పందించారు. ఈ పురస్కారం రావడం చాలా గర్వంగా భావిస్తున్నట్టు చెప్పారు. శ్రేష్ఠ భారత్ నిర్మాణంలో తన వంతు బాధ్యతలు ఈ పురస్కారం మరింత గుర్తు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం రావడంపై ఆయన స్పందిస్తూ, 
 
'నాకు పద్మవిభూషణ్ పురస్కారం దక్కడం నిజంగా నిజంగా చాలా గర్వంగా ఉంది. భారత ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత ప్రజలకు సేవ చేస్తున్న నాకు ఈ అవార్డు దక్కింది. 'శ్రేష్ఠ భారత్' నిర్మాణానికి భారత జాతి ప్రయత్నాలలో నా వంతు బాధ్యతను ఈ పురస్కారం మరింత గుర్తుచేసింది. దేశంలోని రైతులు, మహిళలు, యువత, నాతోటి పౌరులందరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. భారతదేశ కీర్తిని శిఖరాగ్రాలకు చేర్చేందుకు అందరం కృషి చేద్దాం. మాతృభూమి సేవకు పునరంకితం అవుదాం' అంటూ 'ఆయన తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 
 
ఇక తనతోపాటు 'పద్మవిభూషణ్' పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. తన నటనా పటిమతో విశేష సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకొని చలనచిత్ర రంగానికి బహుముఖ సేవలు అందించారని ప్రశంసించారు. పద్మ విభూషణ్ పురస్కారం వరించిన మేటి నటీమణి, భరతనాట్య కళాకారిణి వైజయంతి బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యంలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. 
 
మరోవైపు పద్మశ్రీ పురస్కారాలు వరించిన తెలంగాణకు చెందిన ఏవీ ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్, కే విఠలాచార్యలకు అభినందనలు కే. తెలిపారు. ఈ మేరకు ఆయన మరో ట్వీట్ చేశారు. పద్మ అవార్డులకు ఎంపికైన వారందరికీ వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. తాము ఎంచుకున్న రంగాలలో దేశానికి విశిష్ఠ సేవ, సహకారానికి గుర్తింపుగా ఈ అవార్డులు దక్కాయని ఆయన వ్యాఖ్యానించారు.