ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2024 (08:33 IST)

దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం

national flag
దేశ వ్యాప్తంగా 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి ఈ వేడుకలు మొదలుకాగా, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో  గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత పరేడ్ మైదానంలో అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. 
 
మరోవైపు, 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేశ రాజధాని ముస్తాబైంది. ఢిల్లీలో 70 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో గణతంత్ర దినోత్సవ పరేడ్‌ జరిగే కర్తవ్యపథ్‌ వద్దే 14 వేల మందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. కర్తవ్యపథ్‌లో 90 నిమిషాల పాటు పరేడ్‌ జరగనుంది. ఈ వేడుకల్లో తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన మహిళా అధికారులు పాల్గొననున్నారు. 
 
శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌తో కలిసి కర్తవ్యపథ్‌కు చేరుకుంటారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం వాయుసేనకు చెందిన హెలికాప్టర్లు కర్తవ్యపథ్‌లోని ఆహూతులపై పూల వర్షం కురిపించనున్నాయి. 
 
గణతంత్ర దినోత్సవానికి పంచాయతీరాజ్‌ సంస్థల నుంచి పలువురు ప్రతినిధులను ఆహ్వానించినట్లు పంచాయతీరాజ్‌ శాఖ గురువారం తెలిపింది. కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌ను వీక్షించేందుకు దేశవ్యాప్తంగా పలు పంచాయతీ ప్రతినిధులు, వారి జీవిత భాగస్వాములు సహా 500 మందికి ఆహ్వానాలు అందించినట్లు చెప్పింది. గతంలో జాతీయ పంచాయతీ అవార్డులు పొందిన లేదా విశేష కృషి చేసిన పంచాయతీల ప్రతినిధులను ఎంపిక చేసి పరేడ్‌కు ఆహ్వానించారు.