ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (08:13 IST)

సెప్టెంబరు 15 నుండి కోసువారిపల్లి శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి ప‌విత్రోత్స‌వాలు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక ప‌విత్రోత్స‌వాలు సెప్టెంబరు 15 నుండి 17వ తేదీ వరకు  శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 14న సాయంత్రం 5.30 గంటలకు భగ‌వ‌తారాధ‌న, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.
 
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మ తాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి.

ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 
సెప్టెంబరు 15వ తేదీ ఉదయం 7 గంట‌లకు చ‌తుష్టార్చాన‌, ప‌విత్ర ప్ర‌తిష్ఠ‌, సాయంత్రం 5 గంట‌ల‌కు భ‌గ‌వ‌తారాధ‌న‌, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 16వ తేదీ ఉదయం 7 గంటల నుండి పూర్ణాహుతి, పవిత్ర సమర్పణ, సాయంత్రం 5  గంటల నుండి పవిత్ర హోమం నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 17న ఉదయం 7 గంటల నుండి స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, పవిత్ర వితరణ, మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. అనంతరం సాయంత్రం 5.30 గంటల నుండి స్వామి, అమ్మవార్లను ఆలయంలో తిరుచిపై ఊరేగింపు నిర్వహించనున్నారు.