శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 నవంబరు 2021 (19:24 IST)

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు : తెదేపా అభ్యర్థి కిడ్నాప్

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. ఈ పురపాలక సంస్థకు ఎన్నికల నగారా మోగిననాటి నుంచి అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతల మధ్య ఒకరిపైఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. 
 
అయితే, తాజాగా కుప్పం 14వ వార్డుకు కౌన్సిలర్‌ నామినేషన్‌ వేసిన టీడీపీ రెండో అభ్యర్థి ప్రకాష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. ఇదే వార్డుకు వెంకటేష్‌ అనే వ్యక్తి కూడా టీడీపీ తరుపున నామినేషన్‌ వేశారు. కానీ స్క్రూటీనిలో వెంకటేశ్‌ నామినేషన్‌ సక్రమంగా లేనందువల్ల ఆ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారు. 
 
దీనిపై ప్రకాష్ అన్న గోవిందరాజులు మాట్లాడుతూ, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పార్టీ అధినేత చంద్రబాబు పీఎ మనోహర్, టీడీపీ నేతలు పీఎస్‌ మునిరత్నం, మాజీ సర్పంచ్ వెంకటేష్‌, తన సోదరుడు ప్రకాష్ తోపాటు, అతని భార్యను, అతని పిల్లలు ఇద్దర్నీ బెదిరించి దౌర్జన్యంగా తీసుకెళ్లారని, వారి ఆచూకీ లేదని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేయడం దారుణమని ఆయన ఆరోపించారు.