శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (20:12 IST)

స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందిద్దాం: అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని

స్వాతంత్ర్య సమరయోధుల అందించిన స్వేచ్ఛా ఫలాలను ప్రజలందరికీ అందిద్దామని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ అవరణలో మువ్వెన్నెల జెండాను శనివారం ఆయన ఎగుర వేశారు.

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జాతీయ జెండాను ఎగురవేయడమంటే స్వేచ్చను అనుభవించడమేనన్నారు. ఆనాటి స్వాతంత్ర్య సమర యోధులు తమ ప్రాణ త్యాగాలతో దేశ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్య అందజేశారని, వాటి ఫలాలు ప్రజలందరికీ అందిద్దామని అన్నారు.

ప్రపంచంలోనే భారత దేశం మొదటి స్థానంలో నిలబెట్టడానికి ప్రస్తుత నేతలందరూ అహర్నిశలూ కృషి చేస్తున్నారని కొనియాడారు. జాతీయ, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడానికి ధైర్యంగా ముందుకు సాగుదామన్నారు. ప్రజా తీర్పుతో ఎన్నికైన ప్రభుత్వాలు వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి భయకంపితం చేస్తోందని, మానవాళి ఉనికికే ప్రమాదకరంగా మారిందన్నారు. ప్రజలంతా ఐక్యంగా ధైర్య సాహాసాలతో కరోనా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణామాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అసెంబ్లీ భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారం జాతీయ జెండాను ఎగుర వేశారు.
 
శానసమండలిలో ఘనంగా పంద్రాగస్టు...
అమ‌రావ‌తి: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాసనమండలి ఆవరణలో చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ జాతీయ జెండాను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ భద్రతా సిబ్బంది గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణామాచార్యులు, శాసనమండలి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.