బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (09:16 IST)

కరోనా ఎఫెక్ట్: స్వాతంత్య్ర వేడుకల్లో భారీ మార్పులు

పంద్రాగస్టు పండుగ వస్తుందంటే అందరికీ సంబరమే. మువ్వన్నెల రెపరెపలు, గౌరవ వందనాలు, భావోద్వేగ ప్రసంగాలు, భరతమాత దాస్య శృంఖలాలు తెంపిన నేతల తెంపరితనాల కథలు.. ఇలా అంతా సందడే. అయితే కోవిడ్ విజృంభిస్తున్న వేళ అదవన్నీ సాధ్యమేనా?..

అందుకే ఢిల్లీలో దేశ ప్రధాని పాల్గొనే స్వాతంత్య్ర వేడుకల్లో భారీ మార్పులు చేపట్టారు. ఆగస్టు 15 నాటి ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైంది. 7:21 నిమిషాలకు ప్రధాని ఎర్రకోటకు చేరుకుంటారు. సరిగ్గా 7:30 నిమిషాలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 45 నిమిషాల నుంచి 90 నిమిషాల మధ్య జాతినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం.

అయితే... త్రివిధ దళాల నుంచి గౌరవ వందన కార్యక్రమంలో మాత్రం కోవిడ్ కారణంగా భారీ మార్పులే జరిగాయి. మాములు రోజుల్లో అయితే... త్రివిధ దళాలకు చెందిన జవాన్లు భారీ సంఖ్యలో గౌరవ వందనం ఇస్తారు. ఈసారి మాత్రం కేవలం 22 మంది జవాన్లతోనే గౌరవ వందన కార్యక్రమం ఉంటుంది.
 
జాతీయ జెండాకు గౌరవ పురస్సరంగా సెల్యూట్ చేసే వారు మాత్రం కేవలం 32 మంది జవాన్లతో పాటు 350 మంది ఢిల్లీ పోలీసులు పాల్గొననున్నారు. అయితే... ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపూ... అందరూ భౌతిక దురాన్ని పాటిస్తూ ఉంటారని అధికారులు స్పష్టం చేశారు. ఇక... ఇందులో పాల్గొనే వారు మాత్రం కరోనా నెగెటివ్ ఉన్న వారితో పాటు... కరోనా నుంచి కోలుకున్న జవాన్లకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు.
 
అంతేకాకుండా గౌరవ వందనంలో పాల్గొనే 350 మంది ఢిల్లీ పోలీసులకు కంటోన్మెంట్ లోని ఓ హౌజింగ్ కాలనీని ప్రత్యేకంగా కేటాయించారు. వీరందరూ ఈ హౌజింగ్ కాలనీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదని, కేవలం రిహార్సల్స్ కోసమే బయటికి రావాలని ఉన్నతాధికారులు ఆంక్షలు కూడా జారీ చేశారు.

ఇక, ఎన్‌సీసీ కాండిడేట్లు కేవలం 500 మంది మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఇక  మరో భారీ మార్పు కూడా జరిగింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఈ సారి మాత్రం హాజరు కావొద్దని ఆదేశాలు జారీచేశారు.
 
అతిథుల సంఖ్యలోనూ భారీ కుదింపు చేశారు. కేవలం 120 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. ఒక్కో వరుసలో కేవలం 60 మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రధాని మోదీని అతి దగ్గరి నుంచి ఫొటో తీసే ఫొటో జర్నలిస్టులపై కూడా తగు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రధాని మోదీని ఫొటో తీసే జర్నలిస్టులందరూ కోవిడ్ టెస్టులు విధిగా చేసుకోవాల్సిందేనని సూచించారు. ఇక రిపోర్టర్లకు కూడా కొద్ది సంఖ్యలోనే పాసులకు అనుమతించారు.