ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 జనవరి 2020 (16:36 IST)

జీవితంలో తొలిసారి చూస్తున్నా: నారా భువనేశ్వరి

అమరావతి నుంచి రాజధానిని తరలించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మందడంలో నిర్వహించిన సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అమరావతి ప్రజలకు అండగా ఉంటామని భువనేశ్వరి హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంత ప్రజలనుద్దేశించి సభలో ప్రసంగించిన ఆమె.. ‘ఇంత మంది మహిళలు రోడ్డెక్కి పోరాడటం నా జీవితంలో తొలిసారి చూస్తున్నాను. ఇది చాలా గొప్ప విషయం. అనుకున్నది సాధించి తీరుతారు’ అని అన్నారు.

అమరావతిని దేశానికే ఆదర్శ రాజధానిగా తీర్చిదిద్దాలని చంద్రబాబు తపన పడ్డారని చెప్పారు. ‘అమరావతి తరలిపోకుండా ఉండేందుకు మా జీవితాలను సైతం అడ్డుపెట్టి పోరాడుతాం’ అని భువనేశ్వరి వ్యాఖ్యానించారు. నారా భువనేశ్వరి తన చేతికి ఉన్న గాజులు తీసి అమరావతి ఉద్యమానికి విరాళంగా ఇచ్చిరు. 
 
జగన్‌కు దేవుడు బుద్ధి ప్రసాదించాలి: నెహ్రూ
సీఎం జగన్‌కు దేవుడు బుద్ధి ప్రసాదించాలని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. అమరావతిలో రాజధాని ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరు వస్తుందని, ఆ భయంతోనే జగన్‌ రాజధానిని మారుస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, రాజధాని వికేంద్రీకరణ వద్దని సూచించారు.

రాజధాని విశాఖకు మారిస్తే అరాచక శక్తులు రాజ్యమేలుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుపై కోపం ఉంటే రాజధానికి వైఎస్‌ పేరు పెట్టుకోవాలని సూచించారు. అంతేకాని రాజధాని మార్పు నిర్ణయం మార్చుకోవాలని జ్యోతుల నెహ్రూ హితవుపలికారు.