శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

సకాలంలో ఏపీ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు.. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశం

రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు, విదేశీ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం సాయంతో అమలవుతున్న ప్రాజెక్టులను నిర్ధేశించిన లక్ష్యంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వివిధ శాఖాధిపతులను ఆదేశించారు.

గురువారం వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాక్ లో ఉన్న సమావేశ మందిరంలో ఏపీ పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల ప్రగతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు వీలైనంతగా రాబట్టి ప్రాజెక్టుల పూర్తికి మరియు సంక్షేమ పథకాల అభివృద్ధికి పాటుపడాలని అధికారులకు సూచించారు.

సమావేశంలో రాష్ట్రంలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై దీర్ఘంగా చర్చించారు. 11 ప్రాజెక్టులు ఈఏపీ కింద చేపట్టామన్నారు. విశాఖ-చెన్నై కారిడార్, 24 గంటల విద్యుత్ సరఫరా, సమగ్ర నీటి పారుదల మరియు వ్యవసాయం, గ్రామీణ రహదారి ప్రాజెక్టు, కరువు నిర్మూలనకు మార్గాలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌, జీవనోపాధి మెరుగుదల, విపత్తు పునరుద్ధరణ, గ్రామీణ, పట్టణ నీటి సరఫరా వంటి పలు అంశాలకు సంబంధించి  సమగ్రంగా చర్చించి తగు సూచనలు చేశారు.

అదే విధంగా పలు ప్రాజెక్టులకు సంబంధించి ఎంతమేర నిధులు వచ్చాయి, ఎంత మేర ఖర్చయ్యాయి , ఎన్ని నిధులు పెండింగ్ లో ఉన్నాయి, నిధులు ఎప్పుడు విడుదల చేయాలి అన్న అంశాలపై ఆయా శాఖల సెక్రటరీలు, శాఖాధిపతులను, ఉన్నతాధికారులను అడిగి తెలుసుకొని తదనుగుణంగా దిశానిర్ధేశం చేశారు. త్వరితగతిన ప్రాజెక్టుల అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ-ప్రొక్యూర్ మెంట్ కు సంబంధించి ఆర్బీఐ, ఈడీబీ విడుదల చేసిన పుస్తకాలను ను చదివి అవగాహన చేసుకోవాలన్నారు. 

జుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఏజెన్సీ లేదా స్ధానిక అధికారి రూ.100 కోట్లు మరియు అంతకు మించిన మౌలికసదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి టెండరు ప్రక్రియకు వెళ్ళే ముందు ఆయా పత్రములన్నింటిని న్యాయపరమైన సమీక్షకు ముందు గౌరవ న్యాయమూర్తికి సమర్పించాల్సి ఉంటుందని సిఎస్ స్పష్టం చేశారు.

వివిధ పనులు చేపట్టడంలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న టెండర్ల ప్రక్రియ వాటికి అనుసరిస్తున్న డిజైన్ ప్రక్రియలను పూర్తిగా అప్ డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే సంబంధిత శాఖలు వద్ద ఎంపేనల్ కాబడిన స్పెషలిస్టులు, కన్సల్టెంట్ల వివరాలను ప్రివ్యూ కమీషన్ కు అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సిఎస్ చెప్పారు.

కావున సంబంధిత శాఖలు విధిగా ఈ నిబంధనలను పాటిస్తూ వివిధ పనులు లేదా ప్రాజెక్టుల టెండర్ ప్రక్రియలు చేపట్టే ముందు విధిగా జుడీషియల్ ప్రివ్యూ జడ్జి వారికి పూర్తి వివరాలన్నీ సకాలంలో సమర్పించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు.

ఒకసారి జుడీషియల్ ప్రివ్యూ పరిశీలన చేశాక సంబంధిత టెండర్ ప్రక్రియలో ప్రీబిడ్ నెగోషియేషన్స్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, చీఫ్ ఇంజినీర్ లు తదితరులకు వారి వారి శాఖలకు సంబంధించి రూ.100 కోట్లు పైబడిన టెండర్ ప్రక్రియలకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సిందిగా లేఖలు వ్రాయడం జరిగిందని అన్నారు.

రివ్యూ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌ రావత్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి కె.వి సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి మహ్మద్ అషాన్ రెజా, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మహమ్మద్ ఇలియాస్ రిజ్వీ, రాష్ట్ర  స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కృత్తికా శుక్లా, బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  కరికాల వలవన్,

రవాణా మరియు భవనాలు, రహదారుల శాఖ ముఖ్య కార్యదర్శి యం.టి కృష్ణబాబు, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిశంకర్, దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కిషోర్ కుమార్, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్మ, వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు మరియు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
జుడీషియల్ ప్రివ్యూ పరిశీలనకు సకాలంలో వివరాలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయముల (న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా పారదర్శకత) 2019 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.

గురువారం అమరావతి సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఎపి జుడీషియల్ ప్రివ్యూ జడ్జి డాక్ట‌ర్ బి.శివశంకర్‌రావుల ఆధ్వర్యంలో ఇంటరాక్షన్ ఆన్ ప్రిరివ్యూ కమీషన్‌పై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయముల టెండర్  ప్రక్రియలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు.

ఈ చట్టాన్ని అనుసరించి దాని ద్వారా ప్రభుత్వ వనరులను అనుకూలమైన విధంగా వినియోగించుకొనేలా చూడడానికి మరియు అందుకు సంబంధించిన లేదా అనుషంగికమైన విషయములకై దీనిని తీసుకురావడం జరిగిందని అన్నారు.

ఈ జుడీషియల్ ప్రీవ్యూ చట్టాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఏజెన్సీ లేదా స్ధానిక అధికారి రూ.100 కోట్లు మ‌రియు అంతకు మించిన మౌలికసదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి టెండరు ప్రక్రియకు వెళ్ళే ముందు ఆయా పత్రములన్నింటిని న్యాయపరమైన ముందు సమీక్షకు న్యాయమూర్తికి సమర్పించాల్సి ఉంటుందని సిఎస్ స్పష్టం చేశారు.

వివిధ పనులు చేపట్టడంలో పాదర్శకతను తీసుకువచ్చేందుకు,ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న టెండర్ల ప్రక్రియ వాటికి అనుసరిస్తున్న డిజైన్ ప్రక్రియలను పూర్తిగా అప్ డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే సంబంధిత శాఖలు వద్ద ఎంపేనల్ కాబడిన స్పెషలిస్టులు, కన్సల్టెంట్ల వివరాలను ప్రివ్యూ కమీషన్‌కు అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సిఎస్ చెప్పారు. సంబంధిత శాఖలు విధిగా ఆయా నిబంధనలను పాటిస్తూ వివిధ పనులు లేదా ప్రాజెక్టుల టెండర్ ప్రక్రియలు చేపట్టే ముందుకు విధిగా జుడీషియల్ ప్రివ్యూ జడ్జి వారికి పూర్తి వివరాలన్నీ సకాలంలో సమర్పించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు.

సమావేశంలో ఎపి జుడీషీయల్ ప్రివ్యూ కమీషన్ జడ్డి జస్టిస్‌ డా.బి.శివశంకరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ సంస్ధను నెలకొల్పడంలో ముఖ్య ఉద్దేశం  ప్రజా ప్రయోజనంలో ప్రభుత్వ వనరులను అనుకూలమైన విధంగా వినియోగించేటట్లు ఆ ప్రకారంగా అనుసరించవలిసిన ప్రకియలలో పారదర్శకతను తీసుకువచ్చే లక్ష్యంతో దీనిని తీసుకురావడం జరిగిందన్నారు.

వివిధ శాఖలు ఈ విషయంలో జుడీషియల్ ప్రివ్యూ కమీషన్ కు పూర్తిగా వారి సహాయ సహకారాలను అందించి ప్రజాధనం సద్వియోగం అయ్యేలా కృషి చేయాలని సూచించారు.రూ.100కోట్ల విలువైన టెండర్ ప్రక్రియలన్నిటినీ జుడీషిలయల్ ప్రివ్యూ పరిశీలిస్తుందని తెలిపారు.

ఒకసారి జుడీషియల్ ప్రివ్యూ పరిశీలన చేశాక సంబంధిత టెండర్ ప్రక్రియలో ప్రీబిడ్ నెగోషియేషన్స్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే వివిధ శాఖల కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు తదితరులకు వారి వారి శాఖలకు సంబంధించి రూ.100కోట్ల పైబడిన టెండర్ ప్రక్రియలకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సిందిగా లేఖలు వ్రాయడం జరిగిందని అన్నారు.

దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి కూడా తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, పరిశ్రమలు, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, రవాణా శాఖల ముఖ్య కార్యదర్శిలు రజత్‌భార్గవ, గోపాలకృష్ణ ద్వివేది, యం.టి.కృష్ణబాబు, సాంఘిక సంక్షేమ, మున్సిపల్ పరిపాలన శాఖల కార్యదర్శులు యం.రవిచంద్ర, జె.శ్యామలరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.