ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (12:02 IST)

సోనూ సూద్ పేరుతో కేటుగాళ్ళు... ట్రిపుల్ ఐటీ విద్యార్థికి కుచ్చుటోపీ

కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికీ ఆపద్బాంధవుడుగా కనిపించిన బాలీవుడ్ విలన్ నటుడు సోనూ సూద్. అనేక మందికి తనకు తోచిన విధంగా సాయం చేశారు. మనుషులకే కాదు.. ఏకంగా ప్రభుత్వాలకు సైతం ఆయన సాయం చేశారు. ఈ క్రమంలో ఆయన పేరుతో కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. 
 
శ్రీకాకుళం జిల్లాలో ఆయన పేరు చెప్పి ఓ నిరుపేద విద్యార్థి దగ్గర రూ.2 వేలు కాజేశారు. సంతబొమ్మాళికి చెందిన కొయ్యాన రాంబాబు అనే విద్యార్థి ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్నాడు. తండ్రి కొవిడ్‌తో చనిపోగా తల్లి పక్షవాతంతో మంచంపట్టింది. నిరుపేద కుటుంబం కావడంతో పూట గడవని పరిస్థితి.
 
ఆ యువకుడి పరిస్థితి వివరిస్తూ దాతలు సాయం చేయాలని మీడియాలో కథనాలు వచ్చాయి. సోమవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి రాంబాబుకి ఫోన్‌ వచ్చింది. తాను సోనూసూద్‌నని ఇంగ్లీషులో మాట్లాడుతూ పరిచయం చేసుకున్నాడు. కుటుంబ వివరాలు అడిగి తెలుసుకుని సాయం చేస్తానని నమ్మబలికాడు. సాయంత్రం రూ.3 లక్షలు ఖాతాలో వేస్తానని హామీ ఇచ్చాడు.
 
అయితే, ముందుగా జీఎస్టీ ఫీజు కింద రూ.12 వేలు, రిజిస్ట్రేషన్‌కు రూ.2 వేలు కట్టాలని చెప్పాడు. నమ్మిన రాంబాబు స్నేహితుడు సాయంతో ఆ వ్యక్తి చెప్పిన అకౌంట్‌లో రూ.2 వేలు వేశాడు. వెంటనే ఆ వ్యక్తికి ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో బాధితుడు సంతబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం పోలీసులు ఆరా తీస్తున్నారు.