కాటేసిన పాము పిల్లను ముక్కలుగా కొరికి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తనను కరిచిన పామును ముక్కలు ముక్కులుగా కొరికేశాడు. ఆ తర్వాత ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన రాష్ట్రంలోని మాధోపార్ గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మాధోపూర్ గ్రామంలో 65 ఏళ్ల రామా మహతో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి అతనిని ఒక పాము కాటేసింది. దీంతో కోపం పట్టలేకపోయిన ఆ వ్యక్తి... ఆ పామును వెంటాడి పట్టుకున్నాడు. దాన్ని కసితీరా కొరుకుతూ ముక్కలు చేశాడు.
అనంతరం చనిపోయిన పామును ఇంటి వద్ద ఉన్న చెట్టుకు వేలాడదీశాడు. దీన్ని గమనించిన గ్రామస్థులు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని ఎంతో బతిమాలారు. అయినప్పటికీ వారి మాటను ఆయన వినలేదు.
భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. స్పృహ తప్పినట్టున్న ఆయనను తెల్లవారుజామున కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో, గ్రామంలో విషాదం నెలకొంది.