శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2019 (20:29 IST)

వైద్య సేవల ప్రమాణాలను మెరుగుపర్చేందుకు చర్యలు

రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల్లో ప్రమాణాలను మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యల తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.

శుక్రవారం అమరావతి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన ప్రాథమిక ఆరోగ్య సేవలు పటిష్టీకరణపై విశ్రాంత ఐఏఎస్ అధికారిణి సుజాతారావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచించిన సిఫార్సులపై విస్తృతంగా  సమీక్షించారు.

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ.. వివిధ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత సమర్థవంతంగా మెరుగైన రీతిలో అందించేందుకు సుజాతా రావు కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు, సిఫార్సులు చేయడం జరిగిందని వాటిని సక్రమంగా అమలుచేయడం ద్వారా గ్రామ స్థాయి నుండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయడంతోపాటు అందిస్తున్న వైద్య సేవల్లో ప్రామాణికతను మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

ఇందుకుగాను వైద్య ఆరోగ్యశాఖ పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమం, మున్సిపల్ పరిపాలన తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వివిధ హోటళ్ళు, ఆహార పదార్థాలు సరఫరా చేసే వివిధ పుడ్ ఎస్టాబ్లిష్మెంట్లలో ఆహార పదార్థాల శాంపిల్స్ రెగ్యులర్ గా తీసి పరీక్షించాలని సిఎస్ ఆదేశించారు.

అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటికి సంబంధించి కొన్ని పాయింట్లను గుర్తించి నీటి నమూనాలు సేకరించి పరీక్షించాలని చెప్పారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన ప్రజారోగ్య చట్టాన్నితుచా తప్పక పాటించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.

గ్రామస్థాయి ఆరోగ్య ఉపకేంద్రం మొదలు జిల్లా స్థాయి ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు తదితర ఆసుపత్రులన్నిటిలో తప్పకుండా నిర్వహించాల్సిన ఇన్వెంటరీ కోడ్ రిజిష్టర్లు అన్నిటినీ సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. అదేవిధంగా జిల్లా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో పరిపాలన వ్యవస్థను మెరుగుపర్చాల్సి ఉందని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో గత ఏడాది కాలంగా అందించిన సర్జికల్  సేవలకు సంబంధించిన డేటాను సేకరించి విశ్లేషించాలని అన్నారు. ఈ కమిటీ సిఫార్సు చేసిన సిఫార్సులన్నిటినీ నిర్ధిష్ట గడువు ప్రకారం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధిపతులను సిఎస్ ఆదేశించారు.

కమిటీ చైర్మన్ సుజాతారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వైద్య ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా పునర్వవ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాథమిక వైద్య సేవలకు సంబంధించి గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేయాలని 10 నుండి 18 ఏళ్ల వయస్సు కలిగిన యువతతో గ్రామాల్లో హెల్త్ క్లబ్లు నిర్వహించాలని సూచించారు.

ఆరోగ్య ఉపకేంద్రం స్థాయిలో ఇద్దరు ఎఎన్ఎంలు ఉండాలని, పిహెచ్ సీ స్థాయి ఆరోగ్య సేవలకు సంబంధించి మాట్లాడుతూ ముగ్గురు డాక్టర్లు సహా కనీసం 13మంది సిబ్బంది ఉండాల్సిన అవసరం ఉందని ఓపి సేవలను ఉ.8గం.ల నుండి మధ్యాహ్నం 2గం.ల వరకూ 2గం.ల నుండి రాత్రి 8గం.ల వరకూ నిర్వహించాలని చెప్పారు. సెకండరీ వైద్య సేవలకు సంబంధించి సిహెచ్ సీల్లో ఆప్తమాలజీ, ఇఎన్టీ, పల్లియేటివ్ కేర్ నిపుణులను అందుబాటులో ఉంచాలన్నారు.

క్లినికల్ వర్క్ లో ప్రతి డాక్టర్ నైపుణ్యాన్ని కలిగి ఉండాలని ఆమె సూచించారు. జిల్లా ఆసుపత్రుల్లో సేవలను రోజంతా అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. జిల్లా ఆసుపత్రుల పనితీరును శాఖధిపతులు నిత్యం పర్యవేక్షించాలని ఆమె సూచించారు.

 వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి వైద్య సేవలను మరింత మెరుగుపర్చేందుకు సుజాతారావు కమిటీ సుమారు 20కి పైగా సిఫార్సులను చేయడం జరిగిందని తెలిపారు.

ఆరోగ్య ఉపకేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత సమర్థవంతంగా పనిచేయించడం ద్వారా జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులపై రోగుల భారాన్ని తగ్గించేందుకు తగిన సిఫార్సులను చేయడం జరిగిందని వాటిని సక్రమంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు.

క్యూఆర్ కోడ్ తో కూడిన ఆరోగ్య శ్రీకార్డులను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలో వైద్య సేవలను మెరుగుపర్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.

స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి మాట్లాడుతూ వయో వృద్ధులు, దివ్యాంగుల ఆరోగ్య సేవలకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

సమావేశంలో పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్యామల రావు, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ మరియు ఎన్ హెచ్ఎం ఎండి కార్తికేయ మిశ్రా, ఎపివిపి కమీషనర్ దుర్గాప్రసాద్, ఆరోగ్యశ్రీ సిఇఓ మల్లిఖార్జున, డిఎంఇ వెంకటేశ్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.