శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2019 (19:22 IST)

'మిషన్‌ బిల్డ్‌' పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం: సుజయకృష్ణ

'మిషన్‌బిల్డ్‌' ఏపీ పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వభూములను అమ్మకానికిపెట్టి, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికి రాష్ట్రప్రభుత్వం సన్నద్ధమైందని, టీడీపీనేత, మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

శుక్రవారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పేదల ఇళ్లస్థలాలకు  ఇవ్వడానికి స్థలాలు లేవంటున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, సర్కారుభూములను  అప్పనం గా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే తతంగానికి తెరతీసిందన్నారు.

మిషన్‌బిల్డ్‌ వంకతో తమపార్టీ తాబేదార్లకు, అనుమాయులకు ప్రభుత్వభూముల్ని కట్టబెట్టడానికి వైసీపీసర్కారు ఉత్సాహం చూపడం రాష్ట్రప్రజల దౌర్భాగ్యమన్నారు. రాజశేఖర్‌రెడ్డి హాయాంలో పరిశ్రమలు ఏర్పాటుచేస్తామని చెప్పి, వేలాదిఎకరాల ప్రభుత్వభూముల్ని అప్పనంగా కాజేసిన వాన్‌పిక్‌ లాంటి సంస్థలపై చర్యలు తీసుకోవడం వైసీపీ ప్రభుత్వానికి చేతగాలేదన్నారు.

అటువంటి సంస్థల కిందఉన్న భూముల్ని వదిలేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వభూములపై కన్నేసిన జగన్మోహన్‌రెడ్డి, ఎన్నికల సమయంలో తనకు ఆర్థికంగా అండగా నిలిచిన వ్యక్తులకు వాటిని కట్టబెట్టే కుతంత్రానికి తెరతీశాడని సుజయకృష్ణ మండిపడ్డారు.

ఉన్నభూముల్ని ఇష్టమొచ్చినట్లు తనవారికి దారాధత్తం చేస్తే, భవిష్యత్‌లో ప్రజల అవసరాలకు భూములు  ఎక్కడినుంచి వస్తాయో వైసీపీఅధినేత సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వమే రియల్‌ఎస్టేట్‌ కంపెనీలా వ్యవహరించడం దారుణమని ఆయన వాపోయారు. ప్రైవేట్‌భూములు కొనుగోలుచేసి, పేదలకు ఇస్తామంటున్న ప్రభుత్వం, ప్రభుత్వభూముల్ని ప్రైవేట్‌వ్యక్తులకు  అమ్మాలని చూడటం జగన్‌తుగ్లక్‌ చర్యల్లో భాగమేనని రంగారావు దుయ్యబట్టారు.

వనరుల నుంచి సంపద సృష్టించడం చేతగాని అసమర్థ వైసీపీప్రభుత్వం, ప్రభుత్వ భూముల్ని అమ్మి సంక్షేమపథకాలు అమలుచేస్తామనడం సిగ్గుచేటన్నారు. లోటుబడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రంలో అనేకసంక్షేమపథకాలు అమలుచేసిన చంద్రబాబు, రాష్ట్రాన్ని ఆర్థికంగా  ఆదుకునేందుకు పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేలా చేశారని సుజయకృష్ణ తెలిపారు.

వైసీపీ పాలన చూసి భయభాంతులకు గురైన పారిశ్రామికవేత్తలు పక్కరాష్ట్రాలకు తరలిపోతుంటే,   బ్యాంకుల, ఇతర రుణమంజూరుసంస్థలు ప్రభుత్వ వైఖరితో చేతులేత్తేసిన దుస్థితిని రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం సృష్టించలేని వైసీపీసర్కారు, చివరకు ప్రభుత్వభూముల అమ్మకానికి పూనుకుందన్నారు.

చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్న ఆదానీగ్రూప్‌, రూ.70వేలకోట్ల పెట్టుబడులతో విశాఖ పట్నంలో పెట్టాలనుకున్న పరిశ్రమను తెలంగాణకు తరలడానికి సిద్ధమైందన్నారు.

అదేవిధంగా కియా కార్లపరిశ్రమ రూ.2వేలకోట్లతో ఏర్పాటుచేయాలనుకున్న అనుబంధ పరిశ్రమలన్నీ కర్ణాటక, తమిళనాడు బాటపడితే, రూ.24వేలకోట్లతో ప్రకాశంజిల్లాలోని ఒంగోలులో ఏర్పడాల్సిన పేపర్‌పరిశ్రమ, చిత్తూరుజిల్లాలో రూ.10వేలకోట్లతో ప్రారంభం కావాల్సిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెనక్కు వెళ్లాయన్నారు.

ప్రపంచప్రఖ్యాతి పొందిన లులూ గ్రూప్‌ పర్యాటకరంగంలో విశాఖలో ఏర్పాటుచేయాలనుకున్న పరిశ్రమలు, విద్యారంగంలో సుమారు రూ.12వేలకోట్లతో పెట్టుబడులు పెట్టాలనుకున్న బీఆర్‌.షెట్టి గ్రూప్‌కు చెందిన సంస్థలు రాష్ట్రంనుంచి వెనక్కు వెళ్లేలా చేసిన ఘనత వైసీపీసర్కారుదేనని రంగారావు స్పష్టంచేశారు.

తనఅరాచక, అసమర్ధపాలనతో,  రాష్ట్రానికిరావాల్సిన లక్షలకోట్ల పెట్టుబడు లను రాకుండాచేసిన జగన్మోహన్‌రెడ్డి, చివరకు ప్రభుత్వభూముల అమ్మకానికి పూను కోవడం దారుణమన్నారు. ఆదాయం పెంచుకునే మార్గాలను వదిలేసి, ప్రభుత్వ ఆస్తులు, భూములమ్ముతూ జగన్ సర్కారు ఎన్నాళ్లు పాలన చేస్తుందని నిలదీశారు.