మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 5 నవంబరు 2021 (18:01 IST)

బాబూ... 14 ఏళ్లు సీఎంగా ఉండి, కుప్పంకు మంచి నీళ్లు ఇవ్వలేకపోయావ్!

చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక ఎన్నిక‌ల పండగ వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం సభ నిర్వహిస్తోంది. ఈ సభకు భారీ ఎత్తున జనం తరలి రావడంతో సభా ప్రాంగణం నిండిపోయింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తోపాటు ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, ద్వారకనాథరెడ్డి, వెంకట గౌడ, కోనేటి ఆదిమూలం తదితరులు ఈ సభకు హాజరయ్యారు. 
 
 
ఈ సభలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ 14 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం చేసిన అభివృద్ధి శూన్యం అని అన్నారు. చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పని కూడా తన పాలనలో చేయలేదన్నారు. సాగునీరు, తాగునీరు అందించలేని దౌర్భాగ్యస్థితి చంద్రబాబుది అని ఫైర్ అయ్యారు. అనునిత్యం కుప్పం నుంచి బెంగళూరుకు వేలాదిమంది కూలి పనులకు వెళ్తుంటే చంద్రబాబు ఏం చేసాడు అని ప్రశ్నించారు.
 
 
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ, చంద్రబాబుకు అసహనం పెరిగిపోయింద‌ని, కుప్పం ప్రజలు కూడా ఇప్పుడు చంద్రబాబు నమ్మడం లేదని జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు. 2014 నుంచి ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్న నీళ్లు ఇవ్వడానికి కృషి చేయలేదని అన్నారు. 
 
 
సీఎం జగన్ కుప్పం వాసులకు సాగు, తాగు నీరును ఇవ్వడానికి కృషి చేస్తున్నారని అన్నారు. గుడిపల్లి మండలం బసిని గాని పల్లి వద్ద రెండు టీఎంసీల తో కూడుకున్న రిజర్వాయర్  ఏర్పాటు చేసి కుప్పం సమీపంలోని చెరువులకు నీళ్లు అందించడమే కాకుండా కుప్పం వాసులకు తాగునీరు అందిస్తామన్నారు. హంద్రీనీవా జలాలు పది రోజుల్లోనే కుప్పంకు రానున్నాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.