బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 5 నవంబరు 2021 (16:33 IST)

లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లిస్తాం... మంత్రి బొత్సా

లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ కి సంబంధించి  చక్కెర నిల్వలు విక్రయించగా వచ్చిన మొత్తాన్ని రైతుల బకాయిల చెల్లించిన తర్వాతనే, మిగిలిన మొత్తాన్ని యాజమాన్యానికి చెల్లించాలని నిర్ణ‌యించామ‌ని మంత్రి బొత్స స‌త్య‌న్నారాయ‌ణ చెప్పారు. ఈ అంశాన్ని గ‌త సమావేశాల్లో నిర్ణయించామన్నారు. 
 
విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌.సీ.ఎస్ షుగర్స్ సమస్యపై విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, ఎస్పీ ఎం.దీపిక, జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్, ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. తమది రైతు పక్షపార్టీ ప్రభుత్వమని, రైతులకు మేలు చేసే కార్యక్రమాలే చేపడతామని సూచించారు. లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ కి సంబంధించి  చక్కెర నిల్వలు విక్రయించగా వచ్చిన మొత్తాన్ని రైతుల బకాయిల చెల్లించిన తర్వాతనే, మిగిలిన మొత్తాన్ని యాజమాన్యానికి చెల్లించాలని నిర్ణ‌యించామ‌ని,  ఈ నిర్ణయాన్నిఎంత మేరకు అమలు చేశారనే అంశంపై సీఎం ఆరా తీశారన్నారు. షుగర్ ఫ్యాక్టరీ రైతులు తిరగబడటంలో తప్పు లేదని, వారి అవేదనను అర్ధం చేసుకున్నామని, రైతులకు అణా పైసాతో సహా చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. 
 
ఎన్. సి.ఎస్ షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ యాజమాన్యం 2015 నుండి ఇలానే వ్యవహరిస్తూ వస్తుందని,  2019 లో రూ. 27 కోట్ల లు బాకీ పడితే ఆర్.ఆర్ యాక్ట్ కింద 30 ఎకరాలు అమ్మి బకాయిలు తీర్చమన్నారు. 
ప్రైవేట్ యాజమాన్యంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు ఆనాడే తను తెలియజేసినట్టు గుర్తు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ వద్ద నుండి దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే 30 వేల బస్తాలు షుగర్ ను స్వాధీనం చేసుకున్నామని, ప్రస్తుతానికి రూ.16 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని అధికారులు తెలియజేసారు. 
ఆ బకాయులు ఎలా తీర్చాలో ఆలోచన చేసామని, యాజమాన్యానికి ఇంకా 24 ఎకరాలు ఉన్నాయన్నారు. ఆ 24 ఎకరాలను ఆర్.ఆర్.యాక్ట్ కింద త్వరలోనే అమ్మి బకాయిలు చెల్లిస్తామని తెలియజేసారు. అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని కలెక్టరును అదేశించినట్లు తెలిపారు. 
 
రైతులు అందరిని తాను ఒకటి కోరుతున్నానని ఎవరూ తొందరపడి మాట్లాడవద్దని, 
అధికారం లేని పార్టీ మాటలు అసలు వినొద్దని కోరారు. రైతులు రాళ్లతో పోలీసులు మీద దాడి చేసినా పోలీసులు మాత్రం సంయమనం పాటించారని, కమ్యూనిస్టు పార్టీ ప్రోద్బలంతో టీడీపీ అందదండలతో పోలీసులు మీద తిరగబడేటట్టు చేశారని దుయ్యబట్టారు. ఏదో విదంగా ఆందోళన సృష్టించాలని ప్లాన్ చేశారని, వారి మాటలు విని మరలా అలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 80 వేల టన్నుల చెరుకు దిగుబడి వస్తుందని, 
త్వరలోనే ఆ పంటను ఎక్కడ కొనుగోలు చేపట్టాలో ఆలోచన చేస్తున్నామని మీడియాకి తెలియజేసారు. గంజాయి గురించి మాట్లాడే హ‌క్కు చంద్రబాబుకు లేదని, పోలీసు వ్య‌వ‌స్థ‌పై నింద‌లు వేయ‌డం స‌రికాదని మండిపడ్డారు. రాజ‌ధాని ఉద్య‌మం రైతుల‌ది కాదని. టిడిపి కార్య‌క‌ర్త‌లదని వ్యాఖ్యానించారు.