1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:18 IST)

వాకలపూడి కాళేశ్వరి పరిశ్రమ కాలుష్యంపై చ‌ర్య‌లేవి?

వాకలపూడి కాళేశ్వరి పరిశ్రమ కాలుష్యంపై చ‌ర్య‌లు తీసుకునేలా మంత్రి కన్నబాబు స‌త్వ‌రం స్పందించాల‌ని సిపిఐ డిమాండు చేసింది. ఇక్క‌డి యాజమాన్యానికి పొల్యూషన్ జిల్లా అధికారులు అమ్ముడుపోయార‌ని, అందుకే, కాళేశ్వ‌రి కాలుష్యంపై దశల వారి పోరాటం చేస్తున్న‌ట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు చెప్పారు.
 
కాకినాడ రూరల్ వాకలపూడి సమీపంలో కాళేశ్వరి పరిశ్రమ ప్రతి రోజు వెదజల్లుతున్న కాలుష్యంపై ఇప్ప‌టికే ఉద్య‌మం కొన‌సాగుతోంద‌ని మ‌ధు చెప్పారు. అలాగే, యాజ‌మాన్యం తొలగించిన 16 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, మంత్రి కన్నబాబుని కలిసి సమస్యలు వివరించామని తెలిపారు. అయినా మంత్రి ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదని, వెంటనే స్పందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు కోరారు.
 
మంగళవారం ఉదయం  పొన్నమండ రామచంద్ర రావు భవన్లో సూర్యారావుపేట‌, పోలవరం, గోరస ప్రాంతాలవాసుల సమావేశం నిర్వ‌హించారు. ఇందులో హ్యూమన్ రైట్స్ చైర్మన్ మేరీ కుమారి అధ్యక్షత వహించారు. ఈ సంద‌ర్భంగా మధు మాట్లాడుతూ, మంత్రి కన్నబాబు క‌నీసం యాజమాన్యంతో చర్చించలేదని, మరోపక్క యాజమాన్యం కార్మికులకు ఫోన్ చేసి బెదిరిస్తోంద‌ని ఆరోపించారు. పొల్యూషన్ అధికారులు, ఇక్క‌డి కాలుష్యాన్ని నివారించకపోతే చర్యలు చేపడతామని నోటీసిచ్చినా, ఇప్పటికీ యాజమాన్యం స్పందన లేదని, పొల్యూషన్ జిల్లా అధికారులు వారితో కుమ్మక్కై అయ్యారని అన్నారు 
 
కాలుష్యం బారినపడి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనేక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారన్నార‌ని, అందుకే సిపిఐ, ఏఐటియుసి ఈ సమస్యపై పలురకాల ఆందోళనలు  నిర్వహిస్తోంద‌న్నారు. చివ‌రికి కాళేశ్వరి పరిశ్రమను ఇతర కార్మిక సంఘాలు కలుపుకుని వేలాది మందితో ముట్టడిస్తామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నక్క కిషోర్, ఏఐటీయూసీ నాయకులు అడియారపు శ్రీను, నాగేశ్వరావు, మణికంఠ, సాయి, తదితరులు ప్రసంగించారు.