బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (05:59 IST)

ఏ.ఎస్ పేట దర్గాలో మంత్రి మేకపాటి

మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని 'మిలాద్-ఉన్-నబీ' జరుపుకునే రోజున ఏ.ఎస్ పేట దర్గాను  దర్శించుకోవడం సంతోషంగా ఉందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏ.ఎస్ పేట దర్గా అంటే మొదటి నుంచీ తనకు ప్రత్యేకమైన భావనగా మంత్రి పేర్కొన్నారు.

అనేక రాష్ట్రాల నుంచి యాత్రికులు వచ్చే నెల్లూరు జిల్లాలోని ఏ.ఎస్ పేట దర్గా మౌలిక వసతులను మరింత పెంచి దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి మేకపాటి హామీ ఇచ్చారు. దర్గాకు ఎక్కడెక్కడ నుంచో వచ్చే యాత్రికులకు అనువుగా గాంధీ సెంటర్ లో బస్ షెల్టర్ నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించిన వెంటనే రూ.10 లక్షలతో బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి మేకపాటి.

అంతకు ముందు దర్గాకు వస్తున్న మంత్రి మేకపాటికి దర్గాకు సంబంధించిన ముస్లిం సోదరులు ఘనస్వాగతం పలికారు.  సూళ్లూరు పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో పాటు వచ్చిన మంత్రి మేకపాటి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్ సమర్పించారు.

కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలసకార్మికులకు ఏ.ఎస్ పేట దర్గ, వక్ఫ్ బోర్డు అందించిన వసతి, భోజన సహకారాలను మంత్రి మేకపాటి ఈ సందర్భంగా అభినందించారు. ప్రవక్త మహమ్మద్‌ ఓ సంఘ సంస్కర్తగా, ఆదర్శ భర్తగా, కుటుంబ యజమానిగా, అంకితభావం గల నాయకునిగా జీవనం సాగించడం వల్లే  నేటికీ మహనీయులుగా ఆరాధింపపడుతున్నారని, ప్రతి ఒక్కరూ  ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి మేకపాటి కోరారు.