సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఐఐటీ-హెచ్ విద్యార్థి...
విశాఖపట్టణం సముద్రంలో దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని కార్తీక్ (21)గా గుర్తించారు. హైదరాబాద్ - ఐఐటీలో విద్యాభఅయాసం చేస్తున్నాడు. విశాఖ సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి మృతదేహం కేజీహెచ్‌కు తరలించారు. దీంతో కార్తీక్ తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కార్తీక్ గత ఎనిమిది రోజుల నుంచి కనిపించడం లేదనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ ఐఐటీహెచ్‌లో బీటెక్ (మెకానికల్) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 17వ తేదీన ఐఐటీ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో 19వ తేదీన కార్తీక్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విద్యార్థి విశాఖపట్నం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గతవారం రోజులుగా పలు ప్రాంతాల్లో కార్తీక్ ఆచూకీ కోసం పోలీసులు, తల్లిదండ్రులు విస్తృతంగా గాలించారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొ. మూర్తి ఇద్దరు ప్రత్యేక అధికారులను విశాఖపట్నానికి పంపించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం విద్యార్ధి మృతదేహం లభ్యమైంది. దీంతో కార్తీక్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.