శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

భార్యను - మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపేసిన పోలీస్ అధికారి

gunshot
మహారాష్ట్రలోని పూణెలో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ సీనియర్ పోలీస్ అధికారి కట్టుకున్న భార్యతో పాటు మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆపై సర్వీస్ రివాల్వర్‌తో తాను కూడా కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహారాష్ట్రలోని అమరావతి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ భరత్ గైక్వాడ్ (57) బానర్ ప్రాంతంలో కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈయన సోమవారం విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అధికారి తన తుపాకీతో మొదట తన భార్య మోని గైక్వాడ్ (44)ను తుపాకీతో తలపై కాల్చాడు. 
 
దీంతో ఒక్కసారిగా తుపాకీ శబ్దం వినిపించడంతో పక్క గదిలో ఉన్న కుమారుడు, మేనల్లుడు పరుగున అక్కడకు వచ్చాడు. తలుపు తెరిచిన మేనల్లుడు దీపక్ (35) పైనా కాల్పులు జరిపాడు. ఛాతీపై బులెట్ తగలడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం తాను తుపాకీతో కాల్చుకుని ఆ పోలీసు అధికారి మరణించాడు. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.