శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (15:51 IST)

ఆనందగిరి మెట్ల‌ను మోకాళ్ళపై అధిరోహించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామిపై త‌న‌కున్న అపార‌మైన భ‌క్తిని చాటుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి. ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువుదీరిన ఆనందగిరి 109 మెట్లను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోకాళ్ళపై అధిరోహించారు.

చిత్తూరు జిల్లా, పాకాల మండలం, ఊట్లవారిపల్లి పంచాయతీలోని ఆనందగిరిలో ఆడికృత్తిక వేడుకలు అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు. సోమవారం వేకువజాము 4 గంటలకే ఆనందగిరి వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భక్తి శ్రద్ధలతో, హరోం హర నామస్మరణతో మోకాళ్ళపై నడిచి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పట్ల తనకున్న భక్తిని చాటుకున్నారు.

అనంతరం ఆలయ పాలకమండలి సభ్యులు ఎమ్మెల్యే చెవిరెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామికి నిర్వహించిన కృత్తిక అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కన్నులపండువగా తీర్చిదిద్దిన అలంకరణలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

సంప్రదాయ పద్దతులలో ఆలయ పాలకమండలి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కరోనా నిబంధలు తూచా పాటించేలా చర్యలు చేపట్టాలని పాలకమండలి సభ్యులకు, అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ మునిరత్నం రెడ్డి, పాలకమండలి సభ్యులు, ఇఓ రమణ తదితరులు పాల్గొన్నారు.