1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (10:46 IST)

మెత్తబడిన ముద్రగడ పద్మనాభం.. నేడు ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు...

కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ గడచిన నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు మెత్తబడ్డారు. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రభుత్వం తరపున రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావులు మధ్యవర్తులుగా వచ్చి ఆయనతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ముద్రగడ పద్మానాభం పెట్టిన అనేక డిమాండ్లకు వారు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. 
 
ముఖ్యంగా విశాఖపట్టణంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, నేతలతో సీఎం నారా చంద్రబాబునాయుడు జరిపిన చర్చల సారాంశాన్ని వారు ముద్రగడకు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు చంద్రబాబు చిత్తశుద్ధితో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తోట, బొడ్డులతో చర్చల తర్వాత కాస్తంత మెత్తబడ్డ ముద్రగడ దీక్ష విరమణకు దాదాపుగా అంగీకరించారు. అయితే సోమవారం ఉదయం మరోమారు ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాత తన తుది నిర్ణయం వెల్లడిస్తానని ముద్రగడ వారిద్దరికీ తెలిపినట్లు సమాచారం. 
 
ఇదిలావుండగా, ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరింది. వైద్య పరీక్షలకు ఆయన నిరాకరిస్తున్నారు. ఆయనతో చర్చలు జరిపేందుకు మంత్రి అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, తోట త్రిమూర్తులు కలువనున్నారు. దీక్ష విరమించాల్సిందిగా ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేయనున్నారు. కాపు కార్పొరేషన్‌కు నిధుల కేటాయింపులు, ఇతర కీలక అంశాలపై ముద్రగడతో చర్చించనున్నారు. 
 
కాపు కార్పొరేషన్‌లో దరఖాస్తు చేస్తున్న అందిరికీ రుణాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. మంజునాథ కమిషన్ కాలపరిమితి ఏడునెలలే ఉందని ఇంకా కుదించడం కష్టమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మరోవైపు చిరంజీవి, రఘువీరారెడ్డి ఇవాళ ముద్రగడను కలిసే అవకాశం ఉందనే సమాచారంతో వారిని ముందుగానే ఎక్కడోచోట అదుపులోకి తీసుకునే అవకాశం కన్పిస్తోంది. కిర్లంపూడికి ఎవరినీ అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు తేల్చిచెప్పారు.