శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 24 జనవరి 2020 (09:02 IST)

బొత్సకు ముస్లింల నిరసన.. శవయాత్ర

గత ఎన్నికల్లో కడుపులో పెట్టుకుని కాపాడితే పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతిచ్చి తమను వెన్నుపోటు పొడిచారని వైసీపీపై రగిలిపోతున్న ముస్లింలు.. తాజాగా శాసనమండలి చైర్మన్‌ మహ్మద్‌ షరీ్‌ఫని మంత్రి బొత్స సత్యనారాయణ దూర్భాషలాడటంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

‘‘నువ్వు సాయిబుకే పుట్టావా? నీ అంతుచూస్తా’ అంటూ బొత్స అన్నట్టు టీడీపీ ఎమ్మెల్సీలు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం రాష్ట్రమంతా బొత్సకు వ్యతిరేకంగా ముస్లిం మైనారిటీలు, టీడీపీ నేతలు ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు.

తుళ్లూరులో మంత్రి దిష్టిబొమ్మను ముస్లిం సోదరులు ఊరేగించారు. అనంతరం పక్కనే ఉన్న మురుగునీటి తటాకంలో ఆ దిష్టిబొమ్మని జలసమాధి చేశారు. పోలీసులు అక్కడున్నవారిని ప్రశ్నించే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

144 సెక్షన్‌, 30యాక్టు అమలులో ఉండగా శవయాత్రలు ఎలా చేస్తారంటూ పోలీసులు ఆగ్రహించారు. అనంతరం మురుగు తటాకంలో వెతికి జలసమాధి చేసిన దిష్టిబొమ్మని బయటకు తీశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మైనారిటీ కమిటీ ప్రతినిధులు, టీడీపీ నేతలు.. బొత్సపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మండలి చైర్మన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బొత్స క్షమాపణ చెప్పాలని కర్నూలులో ముస్లింమైనారిటీ స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ జిల్లా అధ్యక్షుడు సలీంఖాన్‌ డిమాండ్‌ చేశారు. నంద్యాలలో తెలుగునాడు ప్రతినిధులు బొత్స తీరును ఖండించారు. షరీఫ్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
 
విజయవాడలో బొత్సకు వ్యతిరేకంగా ముస్లింలు ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తించారు. నగరంలో పాతబస్తీలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. తొలుత పంజా సెంటర్‌లో ఆందోళనకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో గాంధీ విగ్రహం వద్దకు ధర్నాను మార్చారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు.

బొత్స, బుగ్గనలపై గవర్నర్‌ చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బుడమేరులో ముస్లింలు ఆందోళన నిర్వహించారు. బొత్సను సీఎం జగన్‌ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని ప్రెస్‌మీట్‌లో ముస్లిం నేతలు ఫతావుల్లా, ఫారూఖ్‌ షుబ్లీ, షేక్‌ అబ్దుల్‌ రహమాన్‌, ఫిజా, ఇబ్రహీం తదితరులు డిమాండ్‌ చేశారు.
 
బొత్స సొంత జిల్లా విజయనగరంలోనూ నిరసన సెగలు ఎగసిపడ్డాయి. బొత్స తీరు మార్చుకోవాలని జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ బాషా హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో బొత్స క్షమాపణకు టీడీపీ మైనారిటీ సెల్‌ నాయకులు డిమాండ్‌ చేస్తూ, గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

చైర్మన్‌పై దాడికి ప్రయత్నించిన మంత్రులు బొత్స, బుగ్గన, అనిల్‌కుమార్‌లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని మైనారిటీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ హిదాయత్‌ తదితరులు అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.