మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (08:47 IST)

రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న నిరసనలు

రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. తూళ్లూరులో ధర్నా చేసేందుకు పెద్దఎత్తున రైతులు తరలివస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని కోసం భూములిస్తే.. ఇప్పుడు తమ జీవితమే అంధకారమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మందడంలో ప్రధాన రహదారిని రైతులు దిగ్బంధించారు.

రోడ్డుపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పడవను బలవంతంగా పక్కకు తొలగించారు. రోడ్డుపై టెంటు వేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు తీసి ఉదయాన్నే వేసుకోండని గత రాత్రి డీఎస్పీ చెప్పారని, ఇప్పుడు టెంటు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆందోళన చేశారు. టెంటు ఇస్తే నోటీసులు ఇస్తామని షామియానా వాళ్లను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ..ఎండలోనే ధర్నా కొనసాగిస్తున్నారు.

పోలీసులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.‘ పంచాయతీ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగునే మేమే తుడిచేశాం. మేం నల్ల రంగు వేయటం తప్పైతే... పార్టీ రంగు పంచాయతీ కార్యాలయానికి వేయటం తప్పుకాదా?’ అంటూ ప్రశ్నించారు. పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతామని హెచ్చరించారు. పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
 
విట్‌ విద్యార్థుల మద్దతు
మందడంలో రైతుల ధర్నాకు విట్ కళాశాల విద్యార్థులు మద్దతు పలికారు. తమ ఉన్నత భవిష్యత్తు కోసమే రైతులు త్యాగాలు చేశారని, ఒక రాజధాని పూర్తికాకుండా 3 రాజధానులు అభివృద్ధి అసాధ్యమని వారు అంటున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకునే వరకు రైతులకు మద్దతుగా పోరాడతామన్నారు.
 
ఐదో రోజు రిలే నిరాహార దీక్ష
మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా వెలగపూడిలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరింది. రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. ‘ప్రాణాలైనా అర్పిస్తాం.. అమరావతి సాధిస్తాం’ అంటూ నినాదాలు చేస్తున్నారు.
 
చెప్పుల దండతో నిరసన
మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ ఉద్ధండరాయునిపాలెంలో ఓ రైతు వినూత్న నిరసన తెలిపాడు. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో వంటావార్పు కార్యక్రమానికి వచ్చి.. మెడలో చెప్పుల దండ వేసుకొని తన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీ కలుగజేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరాడు.