మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 22 జూన్ 2019 (17:04 IST)

నా తమ్ముడికి ఆ శక్తి ఉంది... ప్రాణం ఉన్నంత వరకు కలిసే ప్రయాణం... మెగా బ్రదర్

సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరి ఎంపి అభ్యర్థిగా పోటీ చేశారు నాగబాబు. మెగా బ్రదర్ కావడంతో నరసాపురంలో నాగబాబు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరిగింది. ఎందుకంటే అక్కడ కాపు సామాజికవర్గం నేతలు ఎక్కువగా ఉండటంతో ఖచ్చితంగా విజయం తధ్యమని భావించారు.
 
నరసాపురంలో నాగబాబు గెలిచి పార్లమెంటుకు వెళతారని, పవన్ కళ్యాణ్‌ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళతారన్న ప్రచారం బాగానే జరిగింది. కానీ ఇద్దరూ ఓడిపోయారు. జనసైనికుల్లో నిరాశ మొదలైంది. అయితే ఇద్దరూ ఘోరంగా ఓడిపోయాక అసలు రాజకీయాల్లో ఉంటారా... పార్టీని నడిపిస్తారా అన్న అనుమానం అందరిలోను కలిగింది. కానీ దానికి మొదటగా తెరదించారు పవన్ కళ్యాణ్‌.
 
ఆ తరువాత తాజాగా నాగబాబు కూడా తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన ప్రకటన చేశారు. నేనూ, నా తమ్ముడూ రాజకీయాల్లోనే ఉంటాం. నేను ఎక్కువ రోజులు నా నియోజకవర్గంలోనే గడుపుతా. నాకు ప్రజల అభిమానం ఉంది. గెలుపు ఓటములంటారా సహజం. ఎందుకు ఓడిపోయాము అన్న విషయంపై ఇప్పటికే సమీక్ష చేసుకుంటున్నామని నాగబాబు వెల్లడించారు. 
 
నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌‌కు పార్టీ నడిపే శక్తి ఉంది. మా వెంట జనసైనికులు ఉన్నారు. కాబట్టి మేము దూసుకుపోతామంటున్నారు నాగబాబు. ఒకవైపు పవన్ కళ్యాణ్‌, మరోవైపు నాగబాబులు ఇద్దరూ జనసేన పార్టీని ముందుండి నడిపిస్తామని చెప్పడంతో జనసేన కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.