భయం వద్దు... యథావిధిగా రైలు సర్వీసులు... : రైల్వే బోర్డు
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. నానిటికీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తికి అనేక ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఇంకోవైపు, లాక్డౌన్ భయం వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో రైళ్ళ రాకపోకలు కొనసాగుతాయా? లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ స్పందించారు. రైళ్ల రాకపోకలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు.
రైళ్లను ఆపడం లేదా తగ్గించే ఆలోచన ఏదీ లేదన్నారు. ప్రయాణించాలనుకున్న వాళ్లకు రైళ్ల కొరత లేదని కూడా సునీత్ తెలిపారు. ఈ సమయంలో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ సాధారణంగానే ఉందని, క్రమంగా రైళ్ల సంఖ్యను పెంచుతామని చెప్పారు.
ఇక రైళ్లలో ప్రయాణించడానికి కొవిడ్ నెగటివ్ రిపోర్ట్ కూడా అవసరం లేదని సునీత్ స్పష్టం చేశారు. కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికులు సంఖ్య పెరుగుతోంది. లాక్డౌన్ భయాలతో ముందే చాలా మంది ప్రయాణాలు చేస్తున్నారు.