ప్రత్యేక హోదా గురించి చట్టంలో లేదు.. అందువల్ల, ఇవ్వలేం : జయంత్ సిన్హా
ఏపీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించి ఎక్కడా పేర్కొనలేదనీ, అందువల్ల దాన్ని ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తేల్చి చెప్పారు. అంతేకాకుండా, విభజన చట్టంలో లేనిదే కాదు... ఉన్నదీ ఇవ్వలేమన్నారు. ఈ మేరకు ఆయన లిఖితపూర్వక సమాధానం కూడా ఇచ్చారు. ఇదే అంశంపై టీడీపీ ఎంపీలు కేశినేని నాని, ఎన్.శివప్రసాద్, అవంతి శ్రీనివాస్ అడిగిన వేర్వేరు ప్రశ్నలకు పైవిధంగా బదులిచ్చారు.
'రాష్ట్రానికి ఎక్సైజ్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సర్కారు కోరింది. అయితే, ప్రాంతాల ఆధారంగా మినహాయింపులు ఇస్తే, దేశంలో ఆర్థిక వక్రీకరణ చోటుచేసుకుంటుంది. మినహాయింపులు లేని ప్రాంతంలోని పరిశ్రమలపై ప్రభావం పడుతుంది. మినహాయింపులు ఉన్న చోటికి పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల... పన్ను ఆదాయం తగ్గిపోతుంది. జీడీపీలో పన్నుల నిష్పత్తి తగ్గుతుంది. ఇన్‌పుట్ డ్యూటీ క్రెడిట్ వ్యవస్థ దెబ్బతింటుంది. అందువల్ల, ఆంధ్రప్రదేశ్‌కు ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపులు ఇవ్వటం లేదు' ఆయన స్పష్టం చేశారు.