మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (20:01 IST)

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఎందుకు?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు స్వర్గీయ ఎన్.టి.రామారావు ఫ్యామిలీ ధన్యవాదాలు తెలిపింది. తొలుత అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ధన్యవాదాలు తెలుపగా, ఆ తర్వాత ఆయన సోదరుడు నందమూరి రామకృష్ణ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దీనికి కారణం లేకపోలేదు. 
 
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఎన్.టి.రామరావు జీవిత చరిత్రను తొమ్మిదో తరగతి సామాజిక శాస్త్రంలో ఓ పాఠ్యాంశంగా చేర్చింది. దీంతో నందమూరి ఫ్యామిలీ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు నందమూరి రామకృష్ణ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.
 
'నందమూరి కుటుంబం తరపున నేను తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం కె.చంద్రశేఖర రావుకు, ఇతర మంత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నందమూరి తారక రామారావుగారి జీవిత చరిత్రను ఓ పాఠ్యాంశంగా చేర్చాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కేవలం నేను మాత్రమే కాదు. రెండు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఈ నిర్ణయంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనందరికీ గర్వకారణం.
 
ఎన్టీఆర్ జీవిత చరిత్ర తరతరాల విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుంది. ఆయన జీవితంలోని క్రమశిక్షణ, నిజాయతీ తదితరాలను గురించి ఈ తరం విద్యార్థులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేదరికం నుంచి వచ్చి, పేదరికాన్ని పారద్రోలేందుకు ఆయన చేసిన కృషి, తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకం. 
 
సమాజంలో అసమానతలు తొలగాలని ఆయన ఎంతో శ్రమించారు. నేటి తరం బాలలు, రేపటి భావి భారత పౌరులుగా మారే దశలో ఎన్టీఆర్ జీవిత పాఠం వారికి మార్గదర్శకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్ ప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞతలు' అని రామకృష్ణ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.