శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:26 IST)

అరుదైన ఘనత సాధించిన భారత్... అగ్రదేశాల సరసన సగర్వంగా...

మరో అరుదైన ఘనతను మన దేశం సాధించింది. భవిష్యత్తులో దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థలు, వైమానిక ప్లాట్‌ఫాంలకు శక్తినిచ్చే దేశీయంగా అభివృద్ధి చేసిన హైపర్‌సోనిక్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ వెహికల్ (హెచ్ఎస్‌టీడీవీ)ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. దీన్ని సోమవారం ఒడిశాలోని వీలర్ ఐలాండ్‌లో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంచ్ కాంప్లెక్స్ నుంచి హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ వెహికిల్‌ను విజయవంతంగా పరీక్షించారని వెల్లడించారు. 
 
హైపర్‌సోనిక్ ప్రొపల్షన్ సాంకేతికతల ఆధారంగా హెచ్ఎస్‌టీడీవీని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) దీనిని అభివృద్ధి చేసినట్టు అధికారులు తెలిపారు. హెచ్ఎస్‌టీడీవీని విజయవంతంగా పరీక్షించడంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవోను అభినందించారు. 
 
దీనిని ఓ మైలురాయిగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్‌ను సాకారం చేసే క్రమంలో ఈ మైలురాయిని సాధించినందుకు డీఆర్‌డీవోను అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలతో మాట్లాడానని, ఈ గొప్ప విజయానికి అభినందించినట్టు చెప్పారు. 
 
వారిని చూసి దేశం గర్విస్తోందన్నారు. హెచ్ఎస్‌టీడీవీ పరీక్ష విజయవంతంతో దేశీయ రక్షణ పరిశ్రమతో కలిసి తర్వాతి తరం హైపర్ సోనిక్ వెహికల్స్ నిర్మాణంలో ఉపయోగపడే అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం భారత్ తన సామర్థ్యాలను ప్రదర్శించిందని డీఆర్‌డీవో అధికారి ఒకరు తెలిపారు.
 
హెచ్ఎస్‌టీడీవీ క్రూయిజ్ క్షిపణులను శక్తిమంతం చేయడంతోపాటు స్క్రామ్‌జెట్ ఇంజిన్లపైనా పనిచేస్తుంది. ఇది మాక్ 6 వేగాన్ని అందుకోగలదు. రామ్‌జెట్స్ కంటే అత్యుత్తమమైనదని అధికారులు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ కూడా అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన చేరింది.