సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 8 జులై 2021 (17:04 IST)

ఎన్టీయార్ చెయ్యి విర‌గొట్టింది టీడీపీ వాళ్ళే: మొండితోక కౌంట‌ర్

మాజీ మంత్రి దేవినేని ఉమకు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితోక అరుణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వారిలో నందమూరి తారక రామారావు మొదటి స్థానంలో ఉంటారు... అలాంటి ఎన్టీయార్ విగ్ర‌హం చేయి విరగకొట్టింది తెలుగు దేశం పార్టీ వాళ్లే... అని విమ‌ర్శించారు.
 
నందిగామ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిటాల జాతీయ ర‌హ‌దారిపై ఎన్టీయార్ విగ్ర‌హం చేతిని గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు విర‌గ్గొట్టారు. దీనిపై తెలుగుదేశం నేత‌లు నానా యాగీ చేస్తున్నార‌ని, అస‌లు దానిని విర‌గొట్టింది టీడీపీ వారే అని మొండితోక అరుణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీలో ఉన్న వర్గ విభేదాలు కారణంగా ఆ మహా నాయకుడిని అవమానించారు... ఒకపక్క ఎంపీ కేశినేని నాని వర్గం మరొక పక్క మాజీ మంత్రి వర్గం దేవినేని... రెండు వర్గాల మధ్య విభేదాలతో వీధిన పడుతున్నార‌ని విమ‌ర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై అసమ్మతితో ఉన్న కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ పనికి పాల్పడినట్లు త‌మ దృష్టికి వచ్చింద‌ని చెప్పారు. సీసీ కెమెరాలు ఉన్నాయి నిజం ఏంటనేది తెలుస్తుంది.
 
నిజానిజాలు తెలుసుకోకుండా మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు... ముందు నిజాలు తెలుసుకోండి... దాడి చేసింది ఎవరైనా శిక్షించబడాల‌ని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ఆరోపణలు చేయడం మానుకుని విగ్రహం ధ్వంసం విషయంలో మీ పార్టీ వారైనా సరే శిక్ష పడాలనే మాట మీద నిలబడండి...అని కౌంట‌ర్ ఇచ్చారు.  
 
నందిగామ డివిఆర్ కాలనీలో జెండా దిమ్మె విషయంలో జరిగింది ఒక ప్రమాదం మాత్రమే... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంత డబ్బులతో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మె పునర్నిర్మించాం.. శిలాఫలకాలపై రంగు పూసింది మీ వాళ్ళే అని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే తెలుసుకుంటే బావుంటుంద‌న్నారు. వర్గ విభేదాలతో పార్టీ అధినేత ఎన్టీ రామారావును  అవమానించి, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం, ఎన్టీయార్‌ని రాజకీయాలకు వాడుకోవడం దౌర్భాగ్యం అని మొండితోక అరుణ్ కుమార్ విమ‌ర్శించారు.