మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2024 (19:45 IST)

పవన్ కల్యాణ్ అద్భుతమైన నాయకుడు, ఆయన్ను అలాగే గెలిపించాలి: సినీ నటి జయసుధ

Jayasudha, Pawan Kalyan
కర్టెసి-ట్విట్టర్
పవన్ కల్యాణ్ అందరిలాంటి నాయకుడు కాదనీ, తన మనసులో ఒక మాట బయటకు ఇంకోమాట చెప్పే మనిషి కాదని సినీ నటి జయసుధ అన్నారు. అలాంటి నాయకులు అరుదుగా వుంటారనీ, కనుక ఇటువంటి అద్భుతమైన నాయకుడు పవన్ కల్యాణ్‌కి ఏ కులాన్నో మతాన్నో అంటగట్టకూడదని అన్నారు. ఆయనను ప్రజా నాయకుడిగా పరిగణించి అందరూ గెలిపించుకోవాల్సిన అవసరం వుందన్నారు. మాలాంటి నాయకులు ఎందరో వున్నారనీ, ఐతే లోపల వున్న మాట ఏదైతో వున్నదో అది చెప్పలేక వుంటామనీ, కానీ పవన్ అలాంటివారు కాదని అన్నారు.
 
పవన్ కల్యాణ్ డబ్బే ప్రధానం అనుకుంటే ఆయన కోసం హిట్ చిత్రాల నిర్మాతలు క్యూలో వున్నారని చెప్పారు. ఎన్నో వందల సినిమా కథలు ఆయన కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. వాటినన్నిటిని పక్కనపెట్టి ప్రజల కోసం తను రాజకీయాలలోకి వచ్చారనీ, అలాంటి వ్యక్తిని ప్రజలు తప్పక గెలిపించుకోవాల్సిన అవసరం వుందన్నారు.
 
కాపుల అభ్యున్నతి కోసం మరో రంగా వచ్చారు...
తెదేపా-జనసేన-భాజపా పొత్తు దాదాపు ఖరారవుతున్న సమయంలో వైసిపి నాయకులు తీవ్రస్థాయిలో ఈ మూడు పార్టీల నాయకులను విమర్శిస్తున్నారు. సినీ నటుడు, వైసిపి నాయకుడు పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ హయాంలో వంగవీటి మోహనరంగ హత్యకు గురయ్యారు. ఆయన సీఎం అవుతారని భావించి ఆయనను తెదేపా వారు హత్య చేసారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
 
అప్పట్లో ఎన్టీఆర్ కంటే రంగాకి పాపులారిటీ ఎక్కువగా వుండేదనీ, అందువల్ల సీఎం రంగా అవుతారనే భయంతో ఆయనను హత్య చేయించారని ఆరోపణలు చేసారు మురళి. ఆ రోజుల్లో రంగా కాపులకు న్యాయం చేస్తారని భావించారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారన్నారు.
 
ఈయన కాపులకి వెన్నుదన్నుగా వుంటారని అనుకుంటుంటే పవన్ కల్యాణ్ నేరుగా చంద్రబాబును సమర్థిస్తున్నారని అన్నారు. కాపులకు సాయం చేయాల్సిన పవన్ చంద్రబాబుకి మద్దతు ఇస్తుంటే ఇక వారి కలలు నెరవేరేది ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు.