శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2023 (10:55 IST)

టీడీపీ - జనసేన సమన్వయ కమిటీకి వేగంగా అడుగులు...

lokesh pawan
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్టుతో ఏపీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో కలిసి బయటకు వచ్చిన తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. 
 
ఇందుకోసం టీడీపీ - జనసేన పార్టీలు కలిసి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ ఇరు పార్టీలు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నాయి. కమిటీ సభ్యుల నియామకంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇప్పటికే కసరత్తు ప్రారంభించి సీనియర్ నేతలతో చర్చించారు. జనసేన సమన్వయ బాధ్యతలు నాదెండ్ల మనోహర్‌కు అప్పగించారు. తెలంగాణ నుంచీ ఓ సభ్యుడిని నియమించే యోచనలో జనసేన ఉంది.
 
త్వరలోనే టీడీపీ తరపున సభ్యుల నియామకం జరగనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పర్యటన ఢిల్లీలో కొనసాగుతోంది. ఆయన వచ్చిన తర్వాత సోమవారం చంద్రబాబుతో జరిగే ములాఖత్‌లో చర్చించిన అనంతరం టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులను ఆ పార్టీ ప్రకటించనుంది. రెండు పార్టీల సమన్వయ కమిటీ ప్రకటన పూర్తయ్యాక ఈనెలలోనే తొలి సమావేశం జరిగే అవకాశముంది.
 
మరోవైపు, చంద్రబాబు అరెస్టుతో సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలోని వైకాపా యువతకు ఆగ్రహం కలిగించింది. ఈ ఘటనను తాము సహించలేకపోతున్నామంటూ పట్టణంలోని నగరిగుట్టకు చెందిన కావేటి శీను ఆధ్వర్యంలో 50 మంది యువకులు మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని రిలే నిరాహారదీక్ష శిబిరం వద్ద ఆదివారం కలిశారు. తమ కుటుంబాలు 30 ఏళ్లుగా వైఎస్‌ కుటుంబం వెంట నడిచాయని ఇకపై వైకాపాను వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. వీరంతా వైకాపాను వీడి టీడీపీలో చేరారు.