మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (15:29 IST)

పొత్తుపై పవన్ కళ్యాణ్ ప్రకటన.. ఏపీ రాజకీయాలను ఓ కుదుపు

Pawan Kalyan
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విస్పష్ట ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదిపాయి. ముందుగా ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా ఆకస్మికంగా ఆయన చేసిన ఈ ప్రకటన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా చేయగలమన్న నమ్మకంతో ఉన్న వైసీపీ వర్గాలు తేరుకోలేని షాక్ ఇచ్చింది. 
 
నిజానికి, టీడీపీ - జనసేన పొత్తు వ్యవహారం దీర్ఘకాలంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. పొత్తు ఉంటుందని ఈ రెండు పార్టీల వర్గాలు ఆశాభావంతో ఉన్నా బీజేపీ అధినాయకత్యం ఆలోచనలు ఎలా ఉంటాయన్న అంశం రాజకీయవర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే కేంద్ర పెద్దలతో ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న సత్సంబంధాల ఆధారంగా పవన్ కళ్యాణ్... టీడీపీ వైపు వెళ్లకుండా నిలువరిస్తారని, ఎవరికి వారు విడివిడిగా పోటీచేస్తే గెలుపు మళ్లీ తమదే అవుతుందని వైసీపీ నాయకులు అంతర్గత సంభాషణల్లో చెబుతూ వచ్చారు.
 
అలాగే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా తమకు జనసేనతోనే మైత్రి ఉందని తరచూ ప్రకటనలు చేస్తుండటంతో, ఏం జరగబోతోందన్న దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. పొత్తు విషయం తేలడానికి మరికొన్ని నెలలు పట్టవచ్చని కూడా రాజకీయవర్గాలు భావిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉరుము లేని పిడుగు మాదిరిగా పవన్ చేసిన ప్రకటన ఉలిక్కిపడేలా చేసింది. 
 
పవన్ ఇంత ఆక స్మికంగా ప్రకటన చేయడానికి కారణం ఏమిటని వైసీపీ నేతలు తమకు పరిచయం ఉన్న జనసేనలోని నేతలు, మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేసి ఆరా తీశారు. బీజేపీ నేతలకు కూడా ఫోన్లు చేసి అడిగి తెలుసుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ గురువారం ఈ ప్రకటన చేయబోతున్నా రన్న విషయం టీడీపీ, జనసేన పార్టీల్లో కూడా ఎవరికీ తెలియదు.
 
తాను ఒక ముఖ్యమైన ప్రకటన చేయాలని అనుకొంటున్నానని మాత్రం పవన్ టీడీపీలో ఒకరిద్దరు ముఖ్యులతో చెప్పారు. రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిసినప్పుడు పవన్ తాను పొత్తుపై ప్రకటన చేయబోతున్నట్లు ఆయనకు చెప్పారు. ఆయనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబుతో ములాఖత్ తర్వాత రాజమండ్రి జైలు బయటే పొత్తుపై విస్పష్ట ప్రకటన చేశారు. 
 
మరోవైపు, ఈ పొత్తు ప్రకటనపై సర్వత్రా సానుకూల స్పందనలు వస్తున్నాయి. పవన్ సరైన సమయాన్ని ఎంపిక చేసుకున్నారని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చంద్రబాబు అరెస్టయి జైల్లో ఉన్న సమయంలో, ఆయనను కలిసి బయటకు వచ్చి వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై పోరాటంలో భాగంగా రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని ఆయన చెప్పడం సముచిత సందర్భంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నాయి. 
 
అలాగే, పవన్ ప్రకటనను టీడీపీ, జనసేన వర్గాలు స్వాగతించాయి. కాగా... ప్రస్తుతానికి చంద్రబాబు ఆరెస్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేపట్టే నిరసన కార్యక్రమాల్లో జనసేన నాయకులు పాల్గొని సంఘీభావం తెలుపుతారని, ఆయన విడుదల తర్వాత ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలో నిర్ణయించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు తెలిపాయి.