1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2023 (18:55 IST)

జైల్లో చంద్రబాబును చూసి బాధపడిన పవన్... అండగా ఉంటామని భువనేశ్వరికి హామీ

lokesh pawan
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆ సమయంలో చంద్రబాబు తనయుడు లోకేశ్‌తో పాటు సినీ హీరో బాలకృష్ణ కూడా ఉన్నారు. బాబుతో 40 నిమిషాల పాటు ములాఖత్ నిర్వహించిన పవన్.. ఆ తర్వాత జైలు బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో మీరు ఏం మాట్లాడారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. 
 
దీనికి పవన్ స్పందిస్తూ, మీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగానని, మీలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి చాలా బాధగా ఉందని చెప్పానని తెలిపారు. పాలసీలపరంగా గతంలో మీతో విభేదించానే గానీ, వ్యక్తిగతంగా మీమీద తనకు ఎలాంటి చెడు అభిప్రాయాలు లేవని స్పష్టంగా చెప్పానని వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అని అక్కడున్న అధికారులను అడిగానని తెలిపారు.
lokesh pawan
 
ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను పవన్ పరామర్శించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు కొంతదూరంలోనే చంద్రబాబు కుటుంబం బస చేస్తుంది. అక్కడకు వెళ్లిన పవన్ కళ్యాణ్ వారితో కాసేపు మాట్లాడారు. మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా వారికి పవన్ కళ్యామ్ హామీ ఇచ్చారు. 
 
మరోవైపు, చంద్రబాబును చూసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన పవన్ కళ్యాణ్... జైలు వద్ద నారా లోకేశ్‌ను ఆత్మీయంగా హత్తుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.