1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2023 (15:12 IST)

మిస్టర్ జగన్.. యుద్ధమే కోరుకుంటే... మేం సిద్ధం : పవన్ కళ్యాణ్

pawan
వైకాపా అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మిస్టర్ జగన్.. నీవు యుద్ధమే కోరుకుంటే.. మేం యుద్ధానికి సిద్ధం అని ప్రకటించారు. ఏపీలో యుద్ధ వాతావరణం క్రియేట్ చేయాలని జగన్ భావిస్తున్నాడని.. నిజంగా జగన్ యుద్ధమే కోరుకుంటే తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం, తనను తెలంగాణ బోర్డర్‌లో అడ్డుకున్న విధానం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని.. పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు. అటు గత నాలుగున్నరేళ్లలో జగన్ ఒక్క ప్రెస్‌మీట్ కూడా పెట్టలేదని.. దమ్ముంటే ఒక ప్రెస్‌మీట్ పెట్టాలని సాక్షి మీడియా సహా జర్నలిస్టు మిత్రులు అడగాలని పవన్ కళ్యాణ్ సూచించారు. 
 
ఎంతసేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణలను ప్రశ్నలు అడగటం కాదని.. సాక్షి యజమానిని కూడా ప్రశ్నించాలని ఎద్దేవా చేశారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని.. ఇచ్చిన హామీలు నెరవేర్చని నాయకుడు జగన్ అని పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. మద్యపాన నిషేధం అని చెప్పి దొంగ హామీ ఇచ్చారని.. ఈరోజు మద్యంలో వచ్చే ఆదాయంలో మూడో వంతు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. 
 
ఇసుక, మైనింగ్‌ను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని పవన్ అన్నారు. దేశానికి బలమైన నాయకుడు కావాలని 2014లో మోడీకి మద్దతు ఇచ్చానని.. అలాగే రాజధాని లేని రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు అవసరం కాబట్టి చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. ప్రత్యే్క హోదాకు సంబంధించి విభేదాలు రావడం వల్లే 2019లో టీడీపీతో కలవలేదన్నారు. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ అధికారికంగా ఈరోజు ప్రకటించారు.