చంద్రబాబు అరెస్టు వెనుక ఢిల్లీ పెద్దల హస్తం : చింతా మోహన్  
                                       
                  
				  				   
				   
                  				  స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అనేది ఒక స్కామే కాదని, దీన్ని బూచిగా చూపి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత సీఎం జగన్ పట్టరాని సంతోషంలో ఉన్నారన్నారు. అయితే, చంద్రబాబుకు సుప్రీంకోర్టులోనే న్యాయం జరుగుతుందని, అప్పటివరకు ఆయన జైల్లో ఉండక తప్పదన్నది తన అభిప్రాయమని చింతా మోహన్ పేర్కొన్నారు. 
				  											
																													
									  
	 
	చంద్రబాబు ఖచ్చితంగా తప్పుచేసివుండరని, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అసలు స్కామే కాదన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులుచేస్తే ముఖ్యమంత్రిగా ఎవరూ పని చేయరన్నారు. చంద్రబాబును జైలుకు పంపించడం దారుణమన్నారు. ఏసీబీ కోర్టు తీర్పు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. ఈ మధ్యకాలంలో జడ్జిమెంట్లు సరిగా ఉండటం లేదని విమర్శించారు. 
				  
	 
	చంద్రబాబుకు రిమాండ్ విధించిన తీర్పులో లోటుపాట్లు ఉన్నాయని చెప్పారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరుగుతుందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో సుప్రీంకోర్టులోనే న్యాయం జరుగుతుందన్నారు. ఈ కేసు కోర్టులో నిలవదన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో వసతులు సరిగా లేవని, లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జగన్ నవ్వుతూ ఇంటికి వెళ్ళారని విమర్శించారు.