సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఆర్. సందీప్
Last Modified: సోమవారం, 11 మే 2020 (15:58 IST)

కరోనా కాలంలో మద్యం షాపులా? మూసేయాలని పిటీషన్

ఏపీలో మద్యం షాపుల వ్యవహారం తాజాగా హైకోర్ట్‌కి చేరింది. మద్యం విక్రయాలు తక్షణమే నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఆంధ్రలో మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా మాతృభూమి ఫౌండేషన్‌తో పాటు పలువురు పిటీషన్‌ను దాఖలు చేయడంతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ జరిపింది. 
 
కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఇలా మద్యం దుకాణాలు తెరిస్తే అది వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది బీఎస్ఎన్‌వీ ప్రసాద్ బాబు వాదించారు. మద్యం దుకాణాల వద్ద మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదని, వారిని నియంత్రించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్ట్ దృష్టికి తీసుకువెళ్లారు. 
 
ఇది రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన సమయం కాగా మద్యం త్రాగితే అది క్షీణిస్తుందని, మద్యపానం నిషేధాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే చాలామార్లు చెప్పిందని, దానిని ఇప్పుడు సాధించడానికి మంచి అవకాశం అని లాయర్ అభిప్రాయం వ్యక్తం చేసారు. నాసిరకం మద్యం అమ్మి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, వాటిని ఇప్పుడే పరీక్షకు పంపాలని సదరు న్యాయవాది కోర్టులో విజ్ఞప్తి చేసారు. దీనిపై వాదనలను వినిపించిన ప్రభుత్వ తరపు న్యాయవాది, సంపూర్ణ మద్యపాన నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్సష్టం చేశారు. 
 
అయితే ఇది వెంటనే సాధ్యం కాదని, దశలవారీగా అమలు చేస్తామని, ఇప్పటికే ఎన్నో సంస్కరణలు ప్రభుత్వం తీసుకువచ్చిందని కోర్టులో వివరించారు. భారీగా మద్యం ధరను పెంచడంతో సామాన్యులు దానిని కొనుగోలు చేసే అవకాశం తక్కువని, తద్వారా వైన్ షాపుల సంఖ్యను కూడా తగ్గించడం జరిగిందని చెప్పారు. ఇరువురి వాదనలను విన్న హైకోర్టు, బుధవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.