శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 5 జూన్ 2020 (21:46 IST)

శ్రీవారు భక్తులకు దూరమై 80 రోజులు, కానీ?

ఆపద మ్రొక్కుల వాడా అనాధ రక్షకా గోవిందా.. గోవిందా అంటే స్వామివారు అన్ని సమస్యలు తీరుస్తారన్నది భక్తుల నమ్మకం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎన్నో వేలకిలోమీటర్లు భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఆ స్వామివారిని దర్సించుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు. అలాగే స్వామికి మ్రొక్కులు సమర్పించుకోవడానికి తిరుమలకు వస్తుంటారు.
 
అలాంటి శ్రీవారిని భక్తులకు దూరం చేసింది కరోనా మహమ్మారి. సరిగ్గా 80 రోజులవుతోంది స్వామివారి దగ్గరకు భక్తులను అనుమతించి. అయితే ఆలయంలో జరగాల్సిన అన్ని వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగానే జరుగుతున్నాయి. కానీ భక్తులు ఆలయంలోకి వెళ్ళకుండా ఇన్ని రోజుల పాటు నిలిచింది ఇదే ప్రథమం.
 
గతంలో సంప్రోక్షణ సమయంలో ఐదురోజుల పాటు భక్తులెవరినీ అనుమతించలేదు. అంతకు ముందు 1989 సంవత్సరంలో రెండురోజుల పాటు భక్తులను దర్సనానికి అనుమతించలేదు. అంతేతప్ప 80 రోజుల పాటు దర్సనాన్ని నిలిపేయడం ఇదే ప్రథమం. కానీ మళ్ళీ ఆ స్వామివారి దర్సనం భక్తులకు లభించబోతోంది.
 
అది కూడా 11వ తేదీ నుంచి దర్సనానికి భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతించాలని టిటిడి నిర్ణయం తీసుకోవడంపై భక్తుల నుంచి ఆనందం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు 11వ తేదీ వస్తుందా.. ఆస్వామివారిని దర్సించుకుందామా అని భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
 
టిటిడి ఉద్యోగులు, సిబ్బందికి ఆ అవకాశాన్ని మొదటగా టిటిడి కల్పిస్తోంది. మొత్తం 14వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు, 7వేల మందికి పైగా పర్మినెంట్ ఉద్యోగులు టిటిడి ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి మొదటగా దర్సనాన్ని కేటాయించి నిబంధనలను అమలు చేయాలని టిటిడి భావిస్తోంది. ఆ దిశగా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.