సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 5 జూన్ 2020 (17:36 IST)

శ్రీవారి ఆలయంలోకి భక్తులకు అనుమతి, అయితే అక్కడ అనుమతించరు, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి..?

తిరుమల శ్రీవారి ఆలయంలోకి ఈనెల 11వ తేదీ నుంచి భక్తులను అనుమతించడానికి టిటిడి సిద్థమైంది. దర్సన విధివిధానాలకు సంబంధించి టిటిడి పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌లు కీలక మీడియా సమావేశాన్ని తిరుమలలో నిర్వహించారు.
 
ఈ నెల 8,9,10 తేదీలలో టిటిడి ఉద్యోగులు, స్థానికులతో శ్రీవారి దర్సనాలు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు టిటిడి పాలకమండలి ఛైర్మన్ తెలిపారు. పరిమిత సంఖ్యలో మాత్రమే దర్సనాలు ఉంటాయని, రోజుకు 7వేల మందికి దర్సనం కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు. 
 
ప్రభుత్వ నిబంధనలను భక్తులు పాటించాలని, మాస్క్‌లు శానిటైజర్లు, తప్పనిసరిగా వాడాలన్నారు. అలాగే టిటిడి తీసుకుంటున్న చర్యలకు భక్తులకు సహకరించాలని కోరారు. తిరుమలలో ప్రధానంగా నాలుగు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని.. అన్నప్రసాద కేంద్రంలో చేతులు శుభ్రపరుచుకునే ప్రాంతంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని విజ్ఙప్తి చేశారు.
 
కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో తీర్థం, శఠారీని రద్దు చేస్తున్నట్లు టిటిడి పాలకమండలి ఛైర్మన్ తెలిపారు. శ్రీవారి పుష్కరిణిలోకి భక్తులను అనుమతించరు. ఇప్పటికే ఆలయంలో భౌతిక దూరం, శానిటైజర్ల సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.