సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 17 జులై 2021 (19:38 IST)

విద్యార్థి సంఘాలు 19న తలపెట్టిన ఛలో తాడేపల్లి కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదు

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది కానీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తుల యొక్క పనులకు అంతరాయం కలిగించడం, హైకోర్టు, రాజభవన్, సెక్రటేరియట్, ముఖ్యమంత్రి కాంప్ కార్యాలయం తదితర ముఖ్యమైన కార్యాలయాలు ముట్టడించడం చట్టరీత్యా నేరం అని గుంటూరు అర్బన్ ఎస్పీ అన్నారు. ముట్టడి లాంటి చర్యలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదు. 
 
ఎక్కడైనా నిరసన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు చేపట్టాల్సి ఉంటే నిబంధనల మేరకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతిలేకుండా ఆందోళన కార్యక్రమాలు చేపట్టే వారిపై చట్టపరమైన చర్యలతో పాటు కోవిడ్ నిబంధనల ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే 144 సెక్షన్ అమలులో ఉందన్న విషయాన్ని అందరూ గమనించాలి. 
 
అమాయక నిరుద్యోగుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించే అవకాశమూ ఉంది. ప్రస్తుతం ప్రపంచం కరోనా మహమ్మారి మొదటి దశ, రెండవ దశ నుంచి కోలుకుంటున్న క్రమంలో మూడో దశ కూడా పొంచి ఉందన్న విషయాన్ని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేశాయి. ఈ తరుణాన, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడటం మనందరి భాద్యత.
 
విద్యార్థులకు పోలీసు శాఖ మనవి
విద్యార్థులు తమ అమూల్యమైన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఆందోళనలకు, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అర్బన్ ఎస్పీ పిలుపునిచ్చారు. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి తమ సమస్యకు పరిష్కారాన్ని పొందాలని విద్యార్థులకు పోలీసుల మనవి.