గెస్ట్‌హౌస్‌లలో చీకటి బాగోతాలు... కొన్నింట్లో వ్యభిచారం
విశాఖపట్టణంలోని పలు గెస్ట్ హౌస్‌లు (అతిథి గృహాలు) చీకటి బాగోతాలకు నిలయంగా మారాయి. కొన్నింట్లో వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతోంది. ముంబై, గోవా, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల నుంచి యువతులను రప్పించి హైటెక్ పద్ధతిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకుని నిఘా పెట్టిన పోలీసులు.... మూడు గెస్ట్ హౌస్‌లకు సీలు వేశారు. మరికొన్నింటిపై ప్రత్యేక నిఘా పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ రాజధానిగా విశాఖపట్టణం కొనసాగుతోంది. సముద్రతీర ప్రాంతం కావడంతో పర్యాటకుల తాకిడి కూడా అధికంగానే ఉంది. ముఖ్యంగా, ఇటీవలి కాలంలో విశాఖ నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. వీరిని తృప్తి పరిచి క్యాష్ చేసుకునేందుకు హోటల్స్, రెస్టారెంట్స్, గెస్ట్‌హౌస్‌లకు చెందిన యజమానులు సరికొత్త ప్లాన్‌లు అమలు చేస్తున్నారు.
వాస్తవానికి గెస్ట్‌హౌస్‌లు నిర్వహించాలంటే చట్టపరంగా అనుమతులు తీసుకోవాలి. కానీ కొంతమంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గెస్ట్‌హౌస్‌లను ఏర్పాటుచేసేస్తున్నారు. గెస్ట్‌హౌస్‌ల వద్ద ఎలాంటి బోర్డులు ఏర్పాటుచేయకుండా కేవలం వెబ్‌సైట్‌లో మాత్రమే తమ గెస్ట్‌హౌస్ చిరునామా, ఫోన్ నంబర్ వంటివి అందుబాటులో ఉంచుతున్నారు. గెస్ట్‌హౌస్‌లలో దిగేవారంతా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందినవారే కావడంతో వారంతా వెబ్‌సైట్ ద్వారా రూమ్‌లను బుక్ చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో నగరంలో లాడ్జిలతోపాటు గెస్ట్‌హౌస్‌లలో వ్యభిచారం జరుగుతోందంటూ నగర పోలీసులకు ఇటీవల కాలంలో వరుస ఫిర్యాదులు అందాయి. దీంతో సీపీ ఆర్కే మీనా అన్ని లాడ్జిలు, గెస్ట్‌హౌస్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడంతోపాటు ప్రత్యేక సిబ్బంది ద్వారా వాటిల్లో జరిగే కార్యకలాపాలపై నిఘా వుంచాలని ఆదేశించారు. ఎక్కడైనా వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి లాడ్జి లేదా గెస్ట్‌హౌస్‌పై దాడి చేస్తున్నారు.
విటులు, యువతులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న తర్వాత పట్టుబడిన విటులతోపాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. లాడ్జి లేదా గెస్ట్‌హౌస్‌ను అక్కడితో వదిలేయకుండా ఆర్డీవో సమక్షంలో వాటిని సీజ్ చేస్తున్నారు. దీనివల్ల వ్యభిచారానికి గదులు అద్దెకు ఇవ్వాలంటే నిర్వాహకులు భయపడే పరిస్థితి కల్పించాలన్నది పోలీస్ అధికారుల భావన. వారం రోజుల కిందట అల్లిపురంలోని ఒక లాడ్జిని సీజ్ చేయగా, బుధవారం సీతమ్మధారలోని ఒక గెస్ట్‌హౌస్‌ను సీజ్ చేశారు. తాజాగా గురువారం బీచ్‌రోడ్డులోని రెండు గెస్ట్‌హౌస్‌లను సీజ్ చేశారు.