జలాశయాలు నిండుగా పొంగి పొర్లుతున్న ప్రాజెక్టులు
మండుటెండలు తొలగి ఈ ఏడాది వరుణుడు త్వరగానే కరుణించడంతో... ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టులు జల కళను సంతరించుకుంటున్నాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజిలోకి పూర్తి సామర్ధ్యంతో నీరు నిండింది. అదనంగా వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు గేట్లను తెరిచి, నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రకాశం బ్యారేజీ గేట్లు ఆరు ఎత్తి, 8,500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. జల వివాదంగా మారిన తెలంగాణ విద్యుత్ ఉత్పత్తితో, పులిచింతల నుంచి 6,500 క్యూసెక్కుల నీరు బ్యారేజీకి భారీగా వచ్చి చేరుతోంది. మున్నేరు, కట్టలేరు, పాలేరు నుంచి మరో 1900 క్యూసెక్కులు నీరు చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది.
ఇండెంట్ లేకుండానే తెలంగాణ నీటిని వాడటంతో, ప్రకాశం బ్యారేజీకి నీళ్లు భారీగా వస్తున్నాయి. బ్యారేజీలో 3.07 టీఎంసీల పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. దీనికి మించి వస్తున్న నీటిని 20 గేట్ల నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఖరీఫ్‌కి రైతులు ఇంకా సన్నద్ధం కాలేదు, కాబట్టి, పంట కాలువలకు నీరు వదిలే అవసరం లేదు అని అధికారులు తెలిపారు.
ఇక కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు నిలిచింది. ఇన్ ఫ్లో నిల్ కాగా, ఔట్ ఫ్లో 21,189 క్యూసెక్కులు గా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 820 అడుగులు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు. శ్రీశైలం కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు. అయితే, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.