మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (21:58 IST)

తాటి ముంజలు కొందామనుకున్నారు.. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిన కారు..?

తాటి ముంజలు కొందామనుకున్నారు.. ఇంతలో ఆ ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తన కళ్లముందే భర్త, బిడ్డలు తీవ్రగాయాలతో విలవిల్లాడిపోవడం చూసి ఆమె తల్లడిల్లిపోయింది. తీవ్రంగా గాయపడినప్పటికీ తన కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం పొట్టనబెట్టుకుందని తలచి రోదించింది. చివరికి ఆమె కూడా తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. 
 
ఈ ఘటన విశాఖ-అరకు రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా అనంతగిరి మండలం శివలింగపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కిల్లో సోనాపతి ఎస్‌.కోటలో ఉంటున్నారు.
 
ఆదివారం భార్యాపిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై శివలింగపురం వెళ్తూ మార్గమధ్యంలో తాటిముంజలు కొనేందుకు రోడ్డు పక్కన ఆగారు. ఆ సమయంలో అరకు నుండి కాకినాడకు వెళుతున్న ఓ కారు.. అదుపు తప్పి.. రోడ్డు పక్క్రనే బండి ఆపిన సోనాపతి ద్విచక్ర వాహనాలను బలంగా ఢీకొంది. 
 
ఈ ఘటనలో టూవీలర్‌పై కూర్చుని వున్న సోనాపతి చిన్నారులు శ్రావణ్‌(7), సుహాస్‌(4) ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సోనాపతి(38)ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. 
 
ఆయన భార్య శ్రావణి తీవ్రగాయాలతో విశాఖలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.