పవన్ కల్యాణ్ జనసేన ఎఫెక్ట్... దవళేశ్వరం బ్యారేజీపై రోడ్డు మరమ్మతు
కొత్త స్టయిల్ లో రాజకీయాలకు ముందడుగు వేసిన పవన్ కల్యాణ్ జనసేనకు స్పందన కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత తన ఉగ్ర రూపాన్ని నిన్న జనసేన సమావేశంలో చూపించి, 24 గంటలు తిరగకముందే, దాని ప్రభావం కనిపిస్తోందని జన సైనికులు చెపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లను శ్రమదానంతో మరమ్మతు చేయడానికి జనసైనికులు కదలి వస్తున్నారని తెలిసి, అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ఆకస్మాత్తుగా ప్రభుత్వంలో చలనం కనిపించింది.
తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల రెండు లేదా 4 తారీఖున ఉద్యమిస్తారని తెలిసి ఆర్. అండ్ బి అధికారులు జాగ్రత్త పడుతున్నారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ పైకి తరలివస్తున్నాడని తెలుకున్న ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి 12 గంటలకు రోడ్డు మరమ్మతులు చేపట్టింది. ఇప్పటికే దవళేశ్వరం బ్యారేజిపై జనసేన శ్రమదానం చేస్తామని పోలీసులకు సమాచారం అందిస్తే, దానికి పర్మిషన్ లేదని అధికారులు సమాధానమిచ్చారు. బ్యారేజిపై రోడ్డు మరమ్మతులు ప్రబుత్వమే చేయాలని, ఎలా పడితే అలా రోడ్డులు వేయడానికి వీలు లేదని ఆర్. అండి బి అధికారులు చెప్పారు. పైగా అది తమ పరిధిలోకి రాదని కూడా చెప్పారు. ఈ దశలో పవన్ కల్యాణ్ పర్యటన సమీపిస్తుండటంతో వడివడిగా అధికారులు గుంతలు పూడ్చి, బ్యారేజిపై రోడ్డు బాగు చేసే పనిని చేపట్టారు.
ఏదైనా మంచి జరిగితే, అంతే చాలని, రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని ప్రజలంటున్నారు.
ఇలాగే పవన్ కల్యాణ్ ప్రతి ఊరు తిరగాలి... అప్పుడు అన్ని ఊర్లు బాగుంటాయి అని అభిమానులు పేర్కొంటున్నారు. ఆకస్మాత్తుగా ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చలనం కలిగించాడని పేర్కొంటున్నారు.