రాయలసీమ ప్రజలను హెచ్చరించిన రోజా.. డిసెంబర్ 2వ తేదీ..?
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నివార్ తుఫాన్ బాధితులను జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటున్నారన్నారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. తిరుపతి విమానాశ్రయంలో రోజా మీడియాతో మాట్లాడుతూ నివార్ తుఫాన్ లో 33శాతం డ్యామేజ్ అయిన రైతులకు విత్తనాలపై 80శాతం సబ్సిడీ కింద అందించమని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు రోజా చెప్పారు.
బాధితులను ఆదుకోవడం.. పునరావాస కేంద్రాలకు తరలించడంలో అధికారులు శాయశక్తులా కృషి చేశారని.. వారిని కూడా ముఖ్యమంత్రి అభినందించినట్లు చెప్పారు. డిసెంబర్ 30వ తేదీ లోగా వరద బాధితుల అకౌంట్లలోకే నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో విపత్తులు వచ్చాయని.. కానీ అలాంటి విపత్తులను ఎదుర్కొని నష్టపోయిన వారిని ఏమాత్రం ఆదుకోలేదన్నారు.
అలాంటి రైతులను, బాధితులను సిఎం 1800 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నట్లు రోజా చెప్పారు. అలాగే ఈ నెల 29 వ తేదీన మరొక తుఫాన్, డిసెంబర్ 2వ తేదీన మూడవ తుఫాన్ వస్తుండడంతో అప్రమత్తంగా ఉంటూ ప్రజలను కాపాడాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు రోజా చెప్పారు.