చంద్రబాబుకు తిరుపతి పోలీసుల నో పర్మిషన్ .. తెదేపా నేతల హౌస్ అరెస్టు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతిలో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్నందున చంద్రబాబు నిరసనలకు అనుమతించటం లేదని ఈస్ట్ డీఎస్పీ తెలిపారు. టీడీపీ అధినేత తిరుపతిలో సోమవారం సాయంత్రం 4 గంటలకు గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో తిరుపతి గాంధీ విగ్రహం వద్ద నిరసనలకు అనుమతిలేదని టీడీపీ పార్టీ కార్యాలయానికి, తిరుపతి మాజీ ఎమ్మెలే సుగుణమ్మకు, నరసింహ యాదవ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి అనుమతి కోరుతూ ఆదివారమే టీటీడీ నేతలు లేఖ ఇచ్చినా, అర్థరాత్రి అనుమతి నిరాకరిస్తున్నట్టు, సోషల్ మీడియాలో తమకు విషయం తెలిసినట్టు టీడీపీ నేతల ఇండ్లకు పోలీసులు నోటీసులు అతికించారు.
ఇదిలావుంటే, జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధర్నా నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నానితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అందరిని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు.
నేడు జిల్లాలో చంద్రబాబు నాయుడు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా ఆపే ప్రసక్తే లేదని టీడీపీ శ్రేణులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.