ఏపీలో శాసనమండలి సభ్యులుగా ఆరుగురు ఏకగ్రీవం
శాసన సభ్యుల కోటాలో శాసన మండలి సభ్యత్వాల కోసం వేసిన ఆరు నామినేషన్లు ఏకగ్రీవం అయినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.వి.సుబ్బారెడ్డి తెలిపారు.
ఎన్నికయిన ఆరుగురిలో నలుగురి ఎన్నిక ధ్రువీకరణ(డిక్లరేషన్) పత్రాలను అందజేసినట్లు ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.
అసెంబ్లీ మినీ కాన్ఫరెన్సు హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కరీమున్నాసా, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథ రెడ్డికి ధ్రువీకరణ(డిక్లరేషన్) పత్రాలను ఆయన అందజేశారు.
ఎమ్మెల్యే కోటాలో జరిగిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు గాను గత మార్చి 4న శాసన మండలి సభ్యత్వాల కోసం వైసీపీకి చెందిన ఆరుగురు సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు.
మరే నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆరుగురిని శాసనమండలి సభ్యులుగా ఎన్నిక చేసిన్నట్లు ఆర్వో సుబ్బారెడ్డి వెల్లడించారు.
వారిలో నలుగురికి ఎన్నిక ధ్రువీకరణ (డిక్లరేషన్) పత్రాలను అందజేసినట్లు తెలిపారు. అహ్మద్ ఇక్బాల్, సి.రామచంద్రయ్య శాసనమండలి సభ్యులుగా ధ్రువీకరణ పత్రాలను అందుకోవాల్సి ఉందని ఆర్వో సుబ్బారెడ్డి వెల్లడించారు.