అల్లూరి జిల్లాలో గంజాయితో పట్టుబడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో నాలుగు కేజీల గంజాయితో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈజీ మనీ కోసం వీరు అడ్డదారులు తొక్కుతూ పోలీసులకు చిక్కారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపించారు. ఈ నిందితుల్లో ఒకరు హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
అల్లూరి జిల్లాలోని సీలేరు జెన్‌కో తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కారును ఆపిన పోలీసులు ఆ కారును, అందులోని యువకుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇందులో నాలుగు కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలోని పర్యాటక అందాలను తిలకించేందుకు వచ్చినట్టు చెప్పిన ఆ ముగ్గురు యువకులు పోలీసులు గద్దించి అడగడటంతో నిజం చెప్పారు. నిందితులను దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన గండికోట లక్ష్మీసాయి, ఏపీలోని పల్నాడు జిల్లా నరసారావుపేటకు చెందిన సీహెచ్. చంద్రశేఖర్ రెడ్డి, షేక్ కిజార్ అహ్మద్‌లుగా గుర్తించారు.
వీరికి బి కన్నులు అనే వ్యక్తి గంజాయిని సరఫరా చేసినట్టు తేలింది. ఈ ముగ్గురు నిందితుల్లో ఇద్దరు టెక్కీలు కాగా, మరొకరు బీటెక్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో నిమగ్నమైవున్నాడు. వీరి నుంచి నాలుగు కేజీల గంజాయితో పాటు నాలుగు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.