శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 18 జులై 2020 (10:16 IST)

శ్రీశైలం ఎమ్మెల్యేకి కరోనా

శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. ఇటీవల శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్ష జరిపారు.

అనంతరం స్వల్పంగా అస్వస్తులు కావటంతో నంద్యాలలోని స్వగృహంలో విశ్రాంతి తీసుకున్నారు. సందేహ నివృత్తి కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాపరీక్షలు జరిపించుకున్నారు. ఎట్టకేలకు పరీక్ష ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఒక  ఆసుపత్రి క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు. 

ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే శిల్పా విడుదల చేసిన ప్రకటన సారాంశం...
 
"నా ప్రియమైన శ్రీశైలం నియోజకవర్గం మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు, బంధు మిత్రులందరికీ మీ శిల్పా చక్రపాణి రెడ్డి తెలియజేయడం ఏమనగా.. స్వల్ప అనారోగ్యం వల్ల సందేహం వచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్నాను. 

ఈ పరీక్షల్లో నాకు పాజిటివ్ అని తేలింది. దీంతో నేను క్వారంటైన్లో తగిన చికిత్స చేయించుకుంటున్నాను. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. అయినప్పటికీ పరీక్షల్లో నెగటివ్ వచ్చేంతవరకు నేను క్వారంటైన్ లోనే ఉండవలసిన అవసరం ఉంది. 

ఈ సందర్బంగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం ఏమనగా చికిత్స కాలం ముగిసే వరకూ నన్ను పరామర్శించేందుకు ఎవరూ రావద్దు. కనీసం ఫోన్లో కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయవద్దు. ఏమైనా ఉంటే నేను స్వయంగా సోషల్ మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను.

మరో ముఖ్యమైన అంశం ఏమంటే గడిచిన కొన్ని దినాలుగా నాతో సన్నిహితంగా మెదిలిన బంధుమిత్రులకు కూడా పరీక్షలు చేయించడం జరిగింది. వారందరికీ నెగటివ్ వచ్చింది. 

ఇటీవల నేను నియోజకవర్గంలో పర్యటించినప్పుడు నాతో కలిసి ప్రయాణించిన వారు, సన్నిహితంగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే తక్షణమే పరీక్షలు చేయించుకొనగలరు. కోవిడ్ లక్షణాలు ఏమున్నా వెంటనే వైద్యాధికారులను సంప్రదించండి. 

జన సమూహంలోకి వచ్చినప్పుడు సామాజిక దూరం పాటించమని, మాస్కులు ధరించమని నేను పదే పదే మీకు విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే. కనుక ఇప్పటికైనా కరోనా ప్రోటోకాల్ పాటించి మిమ్మల్ని మీరు ఈ మహమ్మారి నుంచి రక్షించుకోవాలి అని చేతులెత్తి మరీ వేడుకుంటున్నాను.